కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ మరోసారి మెరిసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణకు అత్యధిక అవార్డులు దక్కాయి. మొత్తం 27 అవార్డుల్లో 8 పురస్కారాలు తెలంగాణకే వచ్చాయి. రాష్ట్రానికి చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాయి.
తెలంగాణకు వచ్చిన అవార్డుల వివరాలు:
1- ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్
2- సరిపోను మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల
3- సామాజిక భద్రత గల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి
4- స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయిపూర్
5- పేదరిక నిర్మూలన, జీవనోపాదులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొడ్డి గ్రామం
6- సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం చీమల్ దారి
7- క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్
8- స్వయం సమ్రుద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ రావు పేట మండలం గంభీర్ రావు పేట గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ
ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులతో సూచికలను ప్రకటించింది కేంద్రం. ఈ తొమ్మిది అంశాలలో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో అత్యుత్తమ పంచాయతీలుగా ప్రకటించారు. ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను రాష్ట్రానికి అందజేస్తారు.
గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి- ఎర్రబెల్లి
ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు. అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, మిగతా ఊళ్లు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని కోరారు.
మంత్రి ఎర్రబెల్లిని, ఆయన టీంని అభినందించిన కేటీఆర్
తెలంగాణ మరోసారి మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో అద్భుత ప్రతిభను చాటింది. తలసరి ఆదాయంలో అత్యధిక పెరుగుదల వచ్చింది. ఉత్తమంగా తెలంగాణ గ్రామ పంచాయతీలు నిలిచాయి. ఓడిఎఫ్ లోనూ దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. గొప్ప ముందు చూపుతో ప్రారంభించి అమలు చేస్తున్న సిఎం కెసిఆర్ గారి మానసపుత్రిక పల్లె ప్రగతి కార్యక్రమం అటు రాష్ట్రానికి, ఇటు పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లికి, ఆయన టీంకి శుభాకాంక్షలు, అభినందనలు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
గ్రామీణాభివృద్ధి పట్ల సీఎం విజన్‌కు నిదర్శనం- హరీష్ రావు
GOI ప్రకటించిన 27 జాతీయ పంచాయతీ అవార్డుల్లో 8 అవార్డులు తెలంగాణ గెలుచుకోవడంపై మంత్రి హరీష్ రావు హర్‌షం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి పట్ల సీఎం కేసీర్ చూపిన విజన్‌కు ఇది నిదర్శనమన్నారు. ఇది గొప్ప విజయమని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి హరీష్ రావు అభినందనలు చెప్పారు.