Marri Joins BJP :   తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. మూడు రోజుల కిందట ఆయన అమిత్ షాను కలిసినట్లుగా తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిస సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు హాజరయ్యారు. 



తెలంగాణలో టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.  తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నారని..  కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.  మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుక పోరాటం చేస్తానని మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 


మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని ... తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు మర్రి శశిధర్ రెడ్డి.  ఇలాంటి  ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు  సంతోషంగా ఉందన్నారు.  బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్న శశిధర్ .. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా  సిద్ధమేనన్నారు. పార్టీ కోసం కష్టపడేతత‍్వం ఉన్న మర్రి శశిధర్‌ రెడ్డి.. బీజేపీలో చేరడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కుటుంబ పాలన అంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి శశిధర్ రెడ్డికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ లభించలేదు. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదని సర్వేల ద్వారా తేలింది. దీంతో ఆయన తనపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో ఆయన ఆ పార్టీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. మర్రి శశిధర్ రెడ్డి తండ్రి.. మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా వ్యవహరించారు. అలాంటి నేత కుమారుడు కూడా పార్టీ వీడిపోవడంతో కాంగ్రెస్‌లో అంతర్మథనం ప్రారంభమయింది.