TSRTC Charges Hike : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) మరో షాక్ ఇచ్చింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్(Deluxe) బస్సుల్లో రూ. 5, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సు(Garuda Bus)ల్లో రూ. 10 టికెట్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఛార్జీల పెంపు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛార్జీలు పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు(Power Charges) పెంచడంపై ఆందోళన చెందుతున్న ప్రజలు తాజాగా ఆర్టీసీ ఛార్జీల పెంపుతో మండిపడుతున్నారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై ఛార్జీల పెంచి భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె వెలుగు ఛార్జీల రౌండప్
పల్లె వెలుగు(Palle Velugu) టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ రౌండప్ చేసింది. చిల్లర సమస్య లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆస్ ఆర్టీసీ పేర్కొంది. పెరిగిన టికెట్ ఛార్జీలను(Ticket Charges) వసూలు చేస్తున్న కండక్టర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ ప్రకటన లేకుండా ఎక్కువ ఛార్జీలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రయాణికుల ప్రశ్నలకు కండక్టర్లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా చూసేందుకుగానూ ఛార్జీలను టీఎస్ఆర్టీసీ రౌండపు విధానాన్ని తీసుకొచ్చింది. రూ.13 ఉన్న టికెట్ ధరను రూ.15 చేసింది. అలాగే రూ.17 ఉన్న టికెట్ ఛార్జీలను రూ.15కు రౌండర్ ఫిగర్ చేసినట్లు తెలిపింది. డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కొన్ని నెలల కిందట టీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలను అమాంతం పెంచేసింది. తాజాగా టోల్ ప్లాజా(Toll Plaza) రూ.1, లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులపై రూ.1 పెంచింది.
బస్ పాస్ ఛార్జీల పెంపు
ఇటీవల రౌండప్ విధానాన్ని తీసుకొచ్చిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు టికెట్ ధరల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్ల రేట్లను రౌండప్ విధానాన్ని చేసినట్లు తెలిపింది. రూ. 12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ. 10గా చేసింది. రూ. 13, రూ. 14 ఉన్న టికెట్ ఛార్జీని రూ. 15గా చేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్ ఛార్జీలు పెంచింది. ఈ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్ ఛార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు ఆర్టీసీ పెంచింది. మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కోంబో టికెట్ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి ఆర్టీసీ పెంచింది.