TS Rains : తెలంగాణను వరుణుడు వదలడంలేదు. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్ గఢ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదిలాబాద్, కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్ జారీ చేసింది.
ఏఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
సోమవారం జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి, జనగాం, భువనగిరి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జులై 26వ తేదీన 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
నిండుకుండలా శ్రీరాంసాగర్
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత 15 రోజులుగా వరద కొనసాగుతూనే ఉంది. వానా కాలం సీజన్ ఆరంభంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీకి ఈ జులై మాసంలో రికార్డుస్థాయిలో వరద వస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది. దీంతో అధికారులు 18 గేట్ల ద్వారా వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.6 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.14 టీఎంసీలుగా ఉంది