Arvind Kejriwal Update:
వన్‌మహోత్సవ్ ఈవెంట్‌లో పోస్టర్ల వివాదం
దిల్లీలో ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లపై వివాదం తలెత్తింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈవెంట్‌లో స్టేజ్‌పై ఉన్న పోస్టర్లలో ప్రధాని మోదీ ఫోటో పెట్టడంపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనతో కలిసి వన మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కాలేదు. పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కూడా గైర్హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ను రాజకీయం చేయాలని చూశారని, అందుకే రావటం లేదంటూ ఆప్ తీవ్రంగా మండి పడుతోంది. నిజానికి ఈ పోస్టర్లపై అంతకు ముందు లెఫ్ట్‌నెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. స్టేజ్‌పైకి వచ్చే సరికి వాటిలో ప్రధాని మోదీ ఫోటోను కూడా జత చేర్చారు. ఈ వివాదంపై గోపాల్ రాయ్ స్పందించారు. ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి కొందరు వచ్చి కావాలనే స్టేజ్‌ను ఆక్రమించుకున్నారని, ఒరిజినల్ పోస్టర్లను తీసేసి ఎల్‌ఈడీ తెరలను పెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఫోటో ఫోకస్ అయ్యేలా కావాలనే పోస్టర్ పెట్టారని విమర్శించారు. "ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉంది. కానీ, పోలీసులు వచ్చి స్టేజ్‌ను అధీనంలోకి తీసుకున్నారు" అని అన్నారు గోపాల్ రాయ్. "ప్రధాని మోదీ ఫోటో ఉన్న పోస్టర్లు తీసేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరించారు" అని ఆరోపించారు.
అయితే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలోని అధికారులు మాత్రం ఈ పోస్టర్‌ను ముందుగానే సీఎం ఆఫీస్‌కు పంపామని, అంతా ఓకే అనుకున్నాకే ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఇటు సీఎం ఆఫీస్‌లోని అధికారులేమో...తమకు పంపిన పోస్టర్‌లో ప్రధాని మోదీ ఫోటో లేదని అంటున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.