TTD News: తిరుమల దర్శనాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు అదే అసంతృప్తి - చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రాలేదా?

Tirumala: తిరమలో శ్రీవారి దర్శనానికి తమ సిఫారసు లేఖలను తీసుకోకపోవడంపై వివాదం కొనసాగుతోంది. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చెల్లడం లేదని అంటున్నారు.

Continues below advertisement

Telangana Leaders TTD: తిరుమలలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రఘునందన్ రావు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత విమర్శలు చేశారు.   తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదన్నారు.  తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని చైర్మన్ బీఆర్.నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ నిర్ణయించిందన్నారు. మార్చి నెల గడిచిపోతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఇంకా అనుమతించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తామని చెప్పిన తర్వాత కూడా  అనుమతంచకపోడం మంచిది కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేదని..కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందని. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. వేసవి సెలవులలో వచ్చే భక్తులకు తాము సిఫారసు లేఖలు ఇస్తామని..తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు.

Continues below advertisement

రెండు రోజుల కిందట తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై చంద్రబాబుకు లేఖ రాశారు.  తి టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై తీవ్ర గందరగోళం నెల‌కొంటుంద‌ని ఈ లేఖలో పేర్కొన్నారు  అధికారుల తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ప్ర‌త్యేకంగా పరిశీలించి సీఎం ఆదేశాలను సక్రమంగా పాటించేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు . 

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ  బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.    

వారి డిమాండ్ మేరకు గత ఏడాది డిసెంబర్ లో    తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల  వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.    తెలంగాణ సీఎంకి  స్వయంగా చంద్రబాబు లేఖ రాశారు.  శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని  తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీనుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో  వీఐపీ బ్రేక్‌ దర్శనం  కొరకు రెండు లేఖలు, స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ కొరకు రెండు లేఖలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు  తెలిపారు. అయితే ఈ ఆదేశాలు అమల్లోకి రాకపోవడంతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు అసంతృప్తికి గురవుతున్నారు. 

Continues below advertisement