Telangana News: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తాజాగా చార్జిషీటును దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో మార్చి 10న తొలిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి నిందితులుగా ఉన్న నలుగురు పోలీసులను అరెస్టు చేయగా.. నిందితులుగా మాత్రం ఆరుగురి పేర్లను చేర్చారు. అరెస్టు అయిన నలుగురిలో ఇప్పటి వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినా కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉందని అన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి అవడంతో ఈ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును బుధవారం (జూన్ 12) వెల్లడించనుంది.