Telangana Police arrested Maoist State Committee member Sunita: తెలంగాణ పోలీసులు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సునీతను అరెస్టు చేశారు.  62 ఏళ్ల కాకరాల సునీత  , మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య.  తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ పోలీసులు , గ్రేహౌండ్స్  బృందం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టయ్యారు. సునీత సుదీర్ఘ కాలంగా ఆజ్ఞాతంలో మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా ఉన్నారు.         

సునీత రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె అరెస్టు మావోయిస్టు నాయకత్వానికి తీవ్రమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. భర్త సుధాకర్‌తో కలిసి పలు ఘటనల్లో కీలక పాత్ర పోషించారు.   తెలంగాణ ,  ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు,   ఆదిలాబాద్ జిల్లాలు, మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు ,  కేంద్ర బలగాలు  యాంటీ-నక్సల్ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నాయి. 

ఆగస్టు 5, 2025న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 2025లో ఛత్తీస్‌గఢ్‌లో 401 మావోయిస్టులు మరణించారని, 1,355 మంది లొంగిపోయారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు  ఏప్రిల్ 2025లో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రేగుట్ట హిల్స్‌లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మావోయిస్టులు మరణించారు, ఇది దేశంలోనే అతిపెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్‌లలో ఒకటిగా భావించవచ్చు.                               సునీత అరెస్టు మావోయిస్టు ఉద్యమంలో నాయకత్వ  సంక్షోభం  సృష్టించవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమె సుధాకర్‌తో కలిసి డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ,  తెలంగాణ స్టేట్ కమిటీ  కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గత దశాబ్దంలో గణనీయంగా తగ్గినప్పటికీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ  ఉనికి  చూపిస్తున్నారు. 

కాకరాల సునీత అరెస్టు తెలంగాణ,  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర ఎదురుదెబ్బగా  భావించవచ్చు.  తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్,   ఛత్తీస్‌గఢ్ బలగాలతో కలిసి నిర్వహిస్తున్న సంయుక్త ఆపరేషన్‌లు నక్సలిజం నిర్మూలన దిశగా వెళ్తున్నాయి.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  న మార్చి 31, 2026 నాటికి నక్సలైట్లు లేకుండా చేస్తామని ప్రకటించారు. 

‘ఆపరేషన్ కగార్’ ప్రభావం మావోయిస్టు పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు డ్రోన్‌లు, ఉన్నత సాంకేతికత, 20,000కుపైగా జవాన్‌లతో ఈ ఆపరేషన్ చేపడుతోంది. మావోయిస్టులు ఎటూ తప్పించుకోకుండా అష్టదిగ్బంధం చేస్తోంది. వారికి నిలువ నాడ లేకుండా ఆహారం, మందులు దొరక్కుండా కట్టడి చేస్తున్నారు. ఈ కారణంతోనే ఆరు నెలల్లో 400కుపైగా మావోయిస్టు శిబిరాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.  దొరికితే ఎన్ కౌంటర్ చేయడం ఖాయం కావడంతో కొంత మంది వ్యూహాత్మకంగా లొంగిపోతున్నారు.. మరికొంత మంది దొరికిపోతున్నారు.  వయసు పైబడిన మావోయిస్టులు పోరాడలేక.. లొంగిపోయేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.