కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్చం చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో రైతుల బాగు కోసం అనేక చట్టాలు చేసింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు రేవంత్. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు రైతులను గాలికి వదిలేసి రాజకీయాల కోసం వాళ్లను ముంచేశారని దుమ్మెత్తి పోశారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై ఇన్నాళ్లు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఫైట్ నడిచేది. తెలంగాణ రైతుల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ ఎప్పుడు ముందు ఉంటుందని రాహుల్ చేసిన ట్వీట్‌తో మరోసారి తెలంగాణలో వేడిరాజుకుంది. అసలు తెలంగాణ రైతులకు అన్యాయం చేయడం మొదలు పెట్టిందే కాంగ్రెస్ అంటూ టీఆర్‌ఎస్ దుమ్మెత్తి పోస్తోంది. రైతుల కోసం పోరాడుతున్న టీఆర్‌ఎస్ ఎంపీలకు మద్దతుగా పార్లమెంట్‌లో పోరాడి తర్వాత చెప్పాలనుకున్నది చెప్పాలని సూచించిందా పార్టీ.
టీఆర్‌ఎస్ లీడర్ల కామెంట్స్‌పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము చేసిన సూచనలను ప్రభుత్వం తీసుకుంటుందని అనుకున్నామని అది జరగలేదన్నారు. కేటీఆరక్ విలాసవంతమైన టూర్లకు వెళ్లి వస్తున్నారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేస్తుందని విమర్శిస్తున్న వాళ్లకు అవగాహన లేదన్నారు. దేశంలోని ప్రాజెక్టులు కట్టింది, హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని గుర్తు చేశారు రేవంత. మండి విధానాలు, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఆలోచన చేసింది కాంగ్రెస్ అని తెలిపారు.
కేటీఆర్‌కు గాంధీ కుటుంబానికి పోలికా ఉందా అంటు ఎద్దేవా చేశారు. ఫుడ్ కార్పొరేషన్‌కు బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని సంతకం చేసిన కేసీఆర్... ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. రైతులకు బియ్యంతో సంబంధం లేదన్న రేవంత్... తెలంగాణ రైతుల పంటను కొనాల్సిన నైతిక బాధ్యత రాష్ట్రానిదే అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేందుకు రైతులను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు.
రైతుల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్‌లో ఆమరణ దీక్ష చేయాలని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంపై నిర్విరామ పోరాటం చేస్తున్నామన్న రేవంత్.. రాబోయే రోజుల్లో కూడా అదే పంథా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్‌లో జరిగే ఉద్యమాల్లో రాహుల్ గాంధీ వచ్చి పాల్గొంటారని వెల్లడించారు రేవంత్ రెడ్డి.