Busted unlicensed drug manufacturing : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో నకిలీ మందుల (Fake Drugs) గుట్టు రట్టయింది. తల్లాడ (Tallada) మండలంలోని అన్నారుగూడెం (Annaru gudem) సమీపంలో నకిలీ మందుల తయారీ చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సమచారం అందింది. ఓ ఫార్మాకంపెనీపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు.  ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజవర్ధనాచారి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 9 క్వింటాళ్ల 35 కిలోల మెటీరియల్ తో పాటు మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 4 కోట్ల 35 లక్షలు ఉంటుందని వఅధికారులు అంచనా వేశారు.


ప్రభుత్వం అనుమతులు లేకుండా మందులు తయారు చేస్తున్నట్లు తేలడంతో ఫార్మా కంపెనీని సీజ్ చేశారు. అన్నారుగూడెం సమీపంలోని కాటన్‌ పార్కులో బయోఫార్మసీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ   ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు లేకుండా నకిలీ మందులను అక్రమంగా తయారు చేస్తున్నారు. ఈ దాడుల్లో 935 కిలోల డ్రగ్స్‌ పౌడర్‌ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఔషధ డ్రగ్స్‌ తయారీ సూత్రధారి సతీశ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరోవైపు డ్రగ్స్ వ్యవహారం పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ దందా తెలంగాణలో జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు ఏం అవసరమో అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నార్కోటిక్‌ బ్యూరోకు సందీప్‌ శాండిల్యను డైరెక్టర్‌ గా నియమించారు. 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్‌ చేసిన కెల్విన్‌ ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు.


మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్‌ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో ర‌వితేజ‌, ఛార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు.