Telugu States Chief Ministers Meeting: తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు... అపరిష్కృతంగా ఉన్న సమస్యలు. వీటిని పరిష్కరించుకునే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు చేపట్టారు. చర్చించి పరిష్కరించుకుందామన్న ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) లేఖకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతి లేఖ పంపారు. 'చర్చించుకుందా రండి' అంటూ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని, సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొనున్నారు.
ఉమ్మడి ఏపీ విభజనకు సంబంధించి అపరిష్కృత అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరువురి నేతల మధ్య ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన, చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల విభజన సహా, ఇతర అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిలు, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఉద్యోగుల మార్పిడి, లేబర్ సెస్ విభజన, సాధారణ సంస్థలపై ఖర్చుల రీయింబర్స్‌మెంట్, హైదరాబాద్‌లో మూడు భవనాలు ఏపీ కోసం కొనసాగించడం అంశాలపై చర్చించనున్నారు.
వీటిపైనే ఫోకస్
ఇరు రాష్ట్రాల మధ్య ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి బకాయిలపైనే సమస్య అపరిష్కృతంగా ఉంది. ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.24 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా.. తెలంగాణనే తమకు రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ వాదిస్తోంది. కాగా, ఇరు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన క్రమంలో విభజన అంశాలు సహా ఇతర అపరిష్కృత సమస్యలపైనా చర్చకు ముందడుగు పడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన చొరవతో ఈ ఏడాది మార్చిలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన సమస్య సైతం పరిష్కారమయ్యాయి. విభజన వివాదాలపై ఇప్పటివరకూ ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.
ఆ 23 సంస్థల విషయంలో..
అయితే, షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడీ కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇక మిగిలిన 23 సంస్థల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరలేదు. అటు, 10వ షెడ్యూల్‌లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్శిటీ, అంబేడ్కర్ యూనివర్శిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఈ అన్ని అంశాలపై శనివారం ముఖ్యమంత్రుల భేటీలో ఓ పరిష్కారం దొరకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే, కృష్ణా జలాల పంపిణీ, కోర్టుల్లో ఉన్న పిటిషన్లు వెనక్కు తీసుకోవడం సహా.. భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం, తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన ఇలాంటి అనేక విషయాలు ఓ కొలిక్కి వస్తాయని ఇరు రాష్ట్రాల నేతలు, అధికారులు భావిస్తున్నారు. అటు, చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Also Read: Telangana: అర్థరాత్రి బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు