Land on Moon: కాలం మారింది. కన్నతల్లికి కడుపు నిండా అన్నం పెట్టాల్సి వస్తుందని బయటకు తరిమేసే రోజులివి. వృద్ధాప్యంలో వారిని ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందేమోనని నడి రోడ్డుపై వదిలేసేవారు కొందరు అయితే వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేవారు మరి కొందరు. అలాంటి వారికి చెంప చెల్లుమనేలా, కనువిప్పు కలిగించేలా ఓ ప్రవాస తెలంగాణ యువతి తన తల్లికి జీవితంలో మర్చిపోలేని కానుక ఇచ్చింది. నవమాసాలు మోసి కళ్లలో పెట్టుకుని చూసుకున్న తల్లికి ఓ కూతురు అరుదైన బహుమతి ఇచ్చింది. అమ్మ మీద ఉన్న ప్రేమను సరికొత్తగా చాటుకుంది. ఏకంగా చంద్రమండలంపైనే భూమిని కొనుగోలు చేసి తల్లికి కానుక ఇచ్చింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని GM కాలనీకి సింగరేణి ఉద్యోగి సుద్ధాల రాంచందర్, వకుళదేవి దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత పదేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్స్ వద్ద ప్రాజెక్టు మేనేజర్‌గా, ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. ఓ సారి తన కార్యాలయంలో చంద్రుడిపై భూమి కొనుగోలు విషయమై ఓ సారి చర్చకు వచ్చింది. చాలా కాలంగా తల్లికి అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్న సాయి విజ్ఞతకు వెంటనే ఆలోచన వచ్చింది. చంద్రునిపై భూమిని కొని తన తల్లికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది.
మదర్స్ డే సందర్భంగా 2022 మార్చి 8న చంద్రుడిపై ఒక ఎకరం భూమి కొనుగోలుకు లూనార్ రిజిస్టేషన్ ద్వారా దరఖాన్తు చేసుకుంది. ఈ నెల 23న వకుళ, ఆమె మనుమరాలు ఆర్త సుద్దాల పేరుపై చంద్రుడిపై ఒక ఎకరం భూమి రిజిస్టేషన్ జరిగింది. చిన్నప్పుడు చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించిన తల్లికి ఏకంగా అక్కడే ఎకరా కొనేసింది. చంద్రయాన్-3 విజయవంతం అయిన రోజునే రిజిస్టేషన్ పత్రాలు చేతికందాయి. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.
తన తల్లికి ఎవరు ఇవ్వని బహుమతి ఇవ్వాలనేది తన కోరిక అని, ఎట్టకేలకు తన కోరిక నెరవేరిందని సాయి విజ్ఞత ఆనందాన్ని వ్యక్తం చేసింది. చంద్ర మండలంలో తన పేరుపై కూతురు సాయి విజ్ఞత భూమి కొనుగోలు చేయడంపై తల్లి వకుళ, తండ్రి రాంచందర్ ఆనందంలో ముగినిపోయారు. తమ సంతోషాన్ని మాటల్లో చెప్పలేమని ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.
చంద్రుడిపై భూమి ఎలా కొంటారంటే
చంద్రుడిపై భూమి కొనుగోలు చేయడానికి ప్రత్యేక విధానం ఉంది. అక్కడ భూక్రయ విక్రయాలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి.
ఎకరా రూ.35 లక్షలకు పైనే
లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ప్రకారం చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు.