Telangana News: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో విద్యుత్ డిమండ్ తో పాటు వినియోగం పపెద్ద ఎత్తున పెరిగిపోయాయి. సాధారణంగా ఎండాకాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ వర్షాకాలం సమయంలో ఎక్కువగా విద్యుత్ డిమాండ్ ఉండడం గమనార్హం. వర్షాకాలంలోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువవడంతో విపరీతమైన ఉక్కపోత పోస్తోంది. దీంతో ఎక్కువ మంది విద్యుత్ ను విపరీతంగా వాడేస్తున్నారు. బుధవారం ఉదయం 9.59 గంటలకు రోజువారీ విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 15,370 మెగావాట్లుగా నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక రోజువారీ డిమాండ్ మార్చి 30వ తేదీ 2023న 15 వేల 490 మెగావాట్లుగా నమోదు అయింది. ప్రస్తుతం వర్షాలు కురవకపోతే రాబోయే వారం రోజుల్లో ఈ రికార్డును బ్రేక్ చేసే మరో రికార్డు నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన నమోదు అయిన అత్యధిక డిమాండ్ 11,144 మెగావాట్లు మాత్రమే. ఏడాది క్రితంతో పోలిస్తే.. ఏకంగా 3,999 మెగావాట్లు అదనంగా డిమాండ్ పెరగడంతో 24 గంటల నిరంతర సరఫరాకు విద్యుత్ పంపిణీ సంస్థలు తెగ ఇబ్బంది పడుతున్నాయి. అదపు వినియోగం పెరుగుతుండడంతో డిస్కంలు ఏరోజుకు ఆ రోజు భారత ఇంధన ఎక్చేంజీ కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. 


వ్యవసాయ బావుల వద్ద నిరంతరాయంగా బోర్లు నడుపుతున్న రైతులు


ఒక రోజంతా అంటే 24 గంటల పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి కరెంటు వినియోగం ఈనెల 19వ తేదీ అత్యధికంగా 28.41 కోట్ల యూనిట్లు ఉంది. ఈనెల 6వ తేదీన ఈ వినియోగం 16.90 కోట్ల యూనిట్లే. అయితే 15 రోజుల్లోనే వినియోగం ఏకంగా దాదాపు 12 కోట్ల యూనిట్లు పెరగడంతో ఐఈఎక్స్ లో కొనుగోలు చేయక తప్పడం లేదు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో ఎక్స్ఛేంజీలో ఒక్కో యూనిట్ కు గరిష్ఠ విక్రయ ధర పది రూపాయలు పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల డిస్కంలు ఇంత ధరకు కొనలేక అనధికారిక కరెంట్ కోతలను విధిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా... వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటలకు నీరు అందించడానికి రైతులు నిరంతరాయంగా వ్యవసాయ బోర్లు నడుపుతున్నారు. ఈ కారణంగా కూడా కరెంటు వినియోగం మరింత పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. అందువల్లs వ్యవసాయానికి పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రివేళల్లో అస్సలే పంట సాగు కోసం కరెంటు ఇవ్వకూడదని వివరించింది. పగటి వేళల్లో డిమాండ్ మరీ ఎక్కువ అయితే సౌర, పవన విద్యుత్ తో తీర్చవచ్చని స్పష్టం చేసింది. ఈనెల ఒకటవ తేదీన పగటి పూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయినా తీర్చడం సాధ్యం అయిందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొరత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈనెల ఒకటవ తేదీన ఈ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదు అయిందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లే విద్యుత్ సరఫరాను పగటి వేళకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ... కేంద్ర విద్యుత్ శాఖ ఈనెల 5వ తేదీన అన్ని రాష్ట్రాలకు లేఖ రాసంది.