Telangana Elections: సీనియర్ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, నేడో, రేపో ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతారని చెప్పారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్నా, ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా రాములమ్మ (Ramulamma) పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, ఇప్పటికే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు హస్తం గూటికి చేరారు.
కమలం పార్టీపై అసంతృప్తి
కొంతకాలంగా బీజేపీలో పరిణామాల పట్ల విజయశాంతి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బలపరుస్తూ ఆమె కొద్ది రోజులుగా వరుస ట్వీట్స్ సైతం చేయగా, అవి చర్చనీయాంశంగా మారాయి. '25 ఏళ్ల రాజకీయ ప్రయాణం నాకు సంఘర్షణను మాత్రమే ఇస్తూ వచ్చింది. ఏ పదవినీ ఏనాడూ కోరుకోలేదు, ఇప్పటికీ పదవుల గురించి అనుకోవడం లేదు. నా పోరాటం బీఆర్ఎస్ కార్యకర్తలపై కాదు. కేసీఆర్ కుటుంబం, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపైనే పోరాడుతున్నా. తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం.' అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ విజయశాంతి పేరు లేదు. మళ్లీ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా, ఆమె పేరును జాబితాలో చేర్చారు.
అప్పుడే పొలిటికల్ ఎంట్రీ
టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ పాత్రలతో లేడీ సూపర్ స్టార్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే పరోక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, సోనియా గాంధీ కర్ణాటక బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో పోటీ నుంచి తప్పుకొన్నారు.
సొంత పార్టీ ఏర్పాటు
దశాబ్దం పాటు బీజేపీలో ఉన్న విజయశాంతి.. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో 2009లో 'తల్లి తెలంగాణ' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. 2009లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన విజయశాంతి, కేసీఆర్‌తో కలిసి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. పార్లమెంట్‌లో తెలంగాణ తరఫున గొంతు వినిపించారు. ఆ తర్వాత కేసీఆర్‌తో విభేదాల నేపథ్యంలో 2014లో టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల టైంలో ఆమెకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత 2020లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాములమ్మ, అదే ఏడాది డిసెంబరులో అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరారు. తాజాగా, బీజేపీలో పరిణామాల నేపథ్యంలో ఆమె అసంతృప్తికి గురై తిరిగి కాంగ్రెస్ లోనే చేరనున్నట్లు తెలుస్తోంది.