Palvai Sravanthi Comments on Congress: కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్, బ్రోకర్ పార్టీగా మారిపోయిందని దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు (Munugodu) నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ 4 పేజీల లేఖను అధిష్ఠానానికి పంపారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని (Koamtireddy Rajagoalreddy) మునుగోడు అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల ఆమె కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. అయితే, ఇంతలోనే పార్టీకి గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి, డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. తాజాగా, తెలంగాణ ఎన్నికల్లో ఆమెకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురై, బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.


రాజీనామా చేస్తూ భావోద్వేగం


కాంగ్రెస్ పార్టీని వీడే క్రమంలో స్రవంతి భావోద్వేగానికి గురయ్యారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆమె, పార్టీకి, పార్టీలో పదవులకు రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించినట్లు తెలిపారు. పార్టీని వీడేందుకు దారి తీసిన పరిస్థితులు, నాయకత్వం తీరుపై లేఖలో వివరించినట్లు చెప్పారు. 'కొంతకాలంగా పదవులు, టికెట్లు కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడాల్సి రావడం బాధగా ఉంది. మా తండ్రి 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌తో ప్రయాణం చేశారు. వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా గొప్పది.' అని పేర్కొన్నారు.


సంచలన వ్యాఖ్యలు


'కాంగ్రెస్ చచ్చిపోయిందని పార్టీని వీడి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మళ్లీ వస్తే కండువా కప్పారు. 24 గంటల్లో మునుగోడు టికెట్ ప్రకటించారు. ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న నాకు కనీసం మాట కూడా చెప్పలేదు. పీసీసీ అధ్యక్షుడు స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ తుంగలో తొక్కేశారు.' అని పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పక్షాన నిలబడేది బీఆర్ఎస్ అని భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి మా ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని, దీనిపై రేపో మాపో నిర్ణయం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 


మునుగోడు నియోజకవర్గంలో పాల్వాయి స్రవంతికి పట్టుంది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో రెబల్‌గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 27 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇక 2022లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన స్రవంతి 22 వేలకు పైగా ఓట్లు సాధించారు. తాజాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరగా, ఆయనకు టిక్కెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురైన స్రవంతి, కారెక్కేందుకు సిద్ధమయ్యారు.


Also Read: ఈటలపై పైచేయి సాధించిన బండి- తుల ఉమకు నిరాశ- పార్టీ వీడే యోచన!