Telangana New Protem Speaker: తెలంగాణ శాసనసభ నూతన ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 06:30 గంటలకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత శాసనసభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.


ఇదీ ప్రాసెస్


కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ తొలి సమావేశాల్లో ఎవరు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ను ఎన్నుకునేంత వరకూ ప్రొటెం స్పీకరే బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యేను శాసనసభ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు.


ప్రస్తుతం అత్యధికంగా 8 సార్లు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరుసార్లు ఎన్నికై తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ మంత్రులుగా ఎంపికయ్యారు. అయితే, మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం తెల్లవారుజామున బాత్రూంలో జారిపడగా, ఆయన కాలికి గాయమైంది. ఈ క్రమంలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ - 64, బీఆర్ఎస్ - 39, బీజేపీ - 8, ఎంఐఎం - 7, ఇతరులు - 1 సంఖ్యా బలం ఉంది. కాగా, 2018లోనూ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, 2014లో జానారెడ్డి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు.


స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్


మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddem Prasad Kumar) పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన వికారాబాద్ (Vikarabad) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తొలుత దుద్దిళ్ల శ్రీధర్ బాబును స్పీకర్ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఆ పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. మెజారిటీ స్పష్టంగా ఉన్నందున స్పీకర్ ఎంపిక లాంఛనప్రాయమే కానుంది. ఏఐసీసీ అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి దళిత వర్గానికి చెందిన ప్రసాద్‌ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శనివారం సమావేశాల్లో ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకోనున్నారు.


Also Read: ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్