జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌(Junior Mens Hockey World Cup)లో తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌(India)కు షాక్‌ తగిలింది. పూల్‌-సీలో స్పెయిన్‌(Spain)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది.  పెనాల్టీకార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో విఫలం కావడం, బలహీనమైన డిఫెన్స్‌ భారత్‌ను దెబ్బ కొట్టాయి. తొలి పోరులోవిజయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత్‌ మైదానంలో కుదురుకోక ముందే కాబ్రీ ఫీల్డ్‌ గోల్‌తో ఝలక్‌ ఇచ్చాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా విస్తుపోయిన భారత్‌ ఏదశలోనూ పుంజుకోలేక పోయింది. ఆట తొలి నిమిషంలోనే స్పెయిన్‌ ఆటగాడు కాబ్రె గోల్‌ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వతా ఆండియ్రాన్‌ రఫీ 18వ నిమిషంలో మరో గోల్‌ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే స్పెయిన్‌ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 



మూడో క్వార్టర్‌ ఆరంభమైన మూడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రోహిత్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ 1-2తో నిలిచింది.  కానీ ఆ తర్వాత 41వ నిమిషంలో కాబ్రీ మరో గోల్‌ చేయగా 60వ నిమిషంలో ఆండ్రియాస్‌ రఫీ మరో గోల్‌ చేశాడు. వీళ్లిద్దరూ చెరో రెండు గోల్స్‌తో అదరగొట్టడంతో స్పెయిన్‌కు ఎదురేలేకుండా పోయింది. ఈ మధ్యలో భారత్‌కు పెనాల్టీకార్నర్లు దక్కినా నిష్ఫలమయ్యాయి.  చివరి క్వార్టర్‌ ఆఖరి నిమిషాల్లో భారత్‌కు 2 పెనాల్టీ కార్నర్లు దక్కినా స్పెయిన్‌ కీపర్‌ కపిల్లడేస్‌ అడ్డుగోడలా నిలిచాడు. ఆఖరి నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను రఫీ గోల్‌లోకి పంపాడు.  భారత్‌ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కొరియా కూడా ఇన్నే పాయింట్లు సాధించినా గోల్స్‌ అంతరంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. స్పెయిన్‌ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.  ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో కొరియా 4-1 కెనడాపై గెలిచింది. కాగా, శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో కెనడాతో భారత్‌ ఆడనుంది. పూల్‌-డిలో నెదర్లాండ్స్‌ 5-3తో బెల్జియంపై, పాకిస్థాన్‌ 4-0తో న్యూజిలాండ్‌పై నెగ్గాయి. 



మలేషియా(Malaysia)  వేదికగా జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌(FIH Hockey Men's Junior World Cup 2023) తొలి మ్యాచ్‌లో యువ భారత్‌(Bharat) శుభారంభం చేసింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. బలమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌(Araijeet Singh Hundal) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియా(South Korea)ను ఓడించింది.



ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా ప్రత్యర్థి జట్టు పుంజుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్స్‌ పడ్డాయి. 16వ నిమిషంలో అర్జీత్‌ సింగ్‌, 30వ నిమిషంలో అమన్‌దీప్‌ గోల్స్‌ చేయడంతో భారత్‌ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయాన్ని ఖరారు చేసుకుంది. కానీ మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. 38వ నిమిషంలో లిమ్‌ చేసిన గోల్‌తో కొరియా ఖాతా తెరిచింది. కానీ వెంటనే అర్జిత్‌ సింగ్‌ 41వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.