KA Paul Petition: తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదంపై కోర్టుకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కేఏ పాల్ పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందా అని పిటిషన్ రు సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరిపించాలా అంటూ పిటిషనర్ పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల తెలంగాణ కొత్త సెక్రటేరియేట్ లో అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. అయితే అది అగ్నిప్రమాదం కాదని, నర బలి అని సుప్రీం కోర్టులో వాదన సందర్భంగా కేఏ పాల్ తెలిపారు. అలాగే తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, దీంతో తన జీవితానికి అభద్రత ఉందని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కేఏ పాల్ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. మీరొక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. మీ ఉద్దేశం వేరు. ఒక దానికి మరొక అంశానికి ముడి పెట్టవద్దు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేఏ పాల్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
గతంలో సీబీఐకి లేఖ రాసిన కేఏ పాల్..!
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ గతంలో సీబీఐకి లేఖ రాశారు కేఏ పాల్. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయని లేఖలో అన్నారు. తెల్లవారుజామున సచివాలయంలో మంటలు ఎగసిపడ్డాయి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించాయి. ఆరో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. డోమ్‌ల నుంచి దట్టమైన పొగ వెలువడటంతో అగ్నిప్రమాదం విషయం వెలుగు చూసింది. భారీ స్థాయిలో పొగ వ్యాపించడంతో లోపల ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉందనే చర్చ జరుగుతోంని పేర్కొన్నారు.
తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజైన ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అలాగే దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. అందుకే ప్రారంభోత్సవం వాయిదా వేశారని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ పై పోరాటంలో తాను వెనక్కి తగ్గబోనని కేఏ పాల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ వెళ్లే మార్గం సైతాన్ మార్గమని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టానని, కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని కోరానని అన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడంతో పతనం అంచుకు చేరుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జన్మదినం రోజు తెలంగాణ సచివాలయం ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని, దాని కోసమే పోరాటం చేస్తున్నానని చెప్పారు.