Liquor Shop Licence: రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.2,639 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు మొత్తం 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ ఆదాయాన్ని పొందింది. ఆగస్టు 21 సోమవారం లాట్ల డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొొంది.


డిసెంబర్ 1, 2023 నుంచి నవంబర్ 2025 వరకు రెండేళ్ల వ్యవధితో దుకాణాల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ లైసెన్స్‌లను మంజూరు చేయనుంది. 2021లో ప్రభుత్వానికి 69,000 దరఖాస్తులు వచ్చాయి. నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.1,350 కోట్లు, షాప్ లైసెన్స్ ఫీజు ద్వారా రూ.3,500 కోట్లు ఆర్జించింది. కొత్త మద్యం పాలసీ 2023-25 ​​ప్రకారం, ప్రతి దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించబడింది. ఒక్కో దుకాణానికి ఏడాదికి లైసెన్సు ఫీజు ఆ ప్రాంత జనాభా ఆధారంగా రూ.50 లక్షల నుంచి రూ.1.1 కోట్ల వరకు ఉంటుంది.


లైసెన్స్ పొందిన వారు ఆ మొత్తంలో 25 శాతాన్ని ఒక సంవత్సరానికి ఎక్సైజ్ పన్నుగా సమర్పించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ పన్ను రూ.5 లక్షలు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లైసెన్సులు జారీ చేయనున్నారు. ప్రభుత్వం కులాలకు 15 శాతం దుకాణాలను కేటాయించింది. గౌడలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు మొత్తం 786 దుకాణాలను కేటాయించనున్నారు. మొత్తం షాపుల్లో హైదరాబాద్‌లో 615 షాపులను కేటాయించనున్నారు. 


కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు సాధారణ కేటగిరీకి 27 శాతం, ప్రీమియం కేటగిరీ, బీరుకు 20 శాతం మార్జిన్‌గా నిర్ణయించారు. ప్రస్తుత లైసెన్సులు నవంబర్ 30 వరకుతో ముగుస్తాయి. నవంబర్-డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 50 మంది వ్యాపారులు పోటీ పడుతున్నారు. 


హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రాంతంలోని ఒక దుకాణానికి గరిష్టంగా 10,908 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్‌లోని మరో దుకాణం కోసం 10,811 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని ఓ దుకాణానికి అత్యల్పంగా (976) దరఖాస్తులు వచ్చాయి. దాని తరువాత స్థానంలో 979 దరఖాస్తులతో ఆదిలాబాద్‌ రెండో స్థానంలో ఉంది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 18 చివరి తేదీ కాగా చివరి రెండు రోజుల్లో ఏకంగా 87 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.


పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, వారి ప్రతినిధులు టెండర్ల ప్రక్రియలో పాల్గొనడమే ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో మొదలై వచ్చే ఏడాది ఎన్నికల పరంపర దృష్ట్యా భారీగా మద్యం ఆదాయం వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా 2015-16లో  తెలంగాణకు రూ.12,703 కోట్ల ఆదాయం వచ్చింది. 2021-22 నాటికి రూ.25,585 కోట్లకు రెట్టింపు అయింది.  2022-23లో అమ్మకాలు దాదాపు రూ. 30,000 కోట్లకు పైగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.