టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Mla Jaggareddy) పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో జరుగుతున్న విషయాలపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి తన ముఖ్య అనుచరులతో రహస్యంగా సమావేశం అయినట్లు సమాచారం. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమీప నేతలు అంటున్నారు. రాజకీయ భవిష్యత్‌పై రేపు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన టీఆర్ఎస్ (TRS) పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని అనుచరుల దగ్గర జగ్గారెడ్డి మనస్తాపం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీలోని కీలక నేతల తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President), నేతల మధ్య కో ఆర్డినేషన్ లేదని పలుమార్లు విమర్శలు చేశారు జగ్గారెడ్డి. 


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అసలు పడదు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే జగ్గారెడ్డి ఫైర్ అవుతుంటారు. వీలు దొరినప్పుడల్లా రేవంత్‌పై విమర్శలు చేస్తూనే ఉంటారు. ముందు నుంచి  జగ్గారెడ్డికి రేవంత్‌ రెడ్డి వర్గానికి అసలు పడేది కాదు. సమయం దొరికినప్పుడుల్లా రేవంత్‌ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేసేవారు జగ్గారెడ్డి. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు జగ్గారెడ్డి. ఇటీవల కేసీఆర్‌(KCR) పై విమర్శల్లో వేడి కూడా తగ్గించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్ది జగ్గారెడ్డి అంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తలను జగ్గారెడ్డి ఖండించారు. రేవంత్‌ రెడ్డి వర్గం సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేసేవారు. 


ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ ను మార్చాలని సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకుని వెళ్లడం లేదని ఒంటెత్తు పోకడలకు పోతున్నారని లేఖలో పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ తన విధాలను మార్చుకోవాలని లేకపోతే ఆయనను మార్చాలని లేఖలో జగ్గారెడ్డి కోరారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, అసలు పార్టీలో చర్చించకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అసంతృప్తిని హైకమాండ్‌కు తెలియజేశారు.  ఈ లేఖపై పెద్ద దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలోనూ జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. అప్పట్లో పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.