Telangana Assembly Sessions | హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.87 వేల కోట్లు (87 వేల 4 వందల 49 కోట్లు) వెచ్చించి కట్టిన ప్రాజెక్టు కూలిపోవడం దారుణం అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy ) రూ. 21 వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ బ్యారేజీ, పంప్ హౌస్‌లు 20 నెలల నుంచి నిరుపయోగంగా ఉండటం దురదృష్టకరం అన్నారు. డ్యామ్‌కు, బ్యారేజ్‌కు తేడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. 

లక్ష కోట్ల ఖర్చు.. లక్ష ఎకరాలకు నీళ్లు రాలేదు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు. ఎనబై ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఎకరాలకు సైతం నీళ్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతింది. కట్టిన తరువాత తక్కువ కాలానికే బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. బ్యారేజ్‌లకు జరిగిన నష్టం రాష్ట్ర ప్రజలకు పెనుభారంగా మారింది. ప్రజా ధనం వృథా అయిందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక ప్రాజెక్టులు నిర్మించాయి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2004 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి స్కీమ్, మహాత్మ జ్యోతిబాపులే దుమ్ముగూడెం, నెహ్రా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ చేపట్టింది. కానీ బీఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టాలని డీపీఆర్ లో లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యాప్కోస్ రిపోర్ట్ రాకముందే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నిర్ణయం తీసుకున్నారు. డీపీఆర్ 17 జనవరి 2016న ఇచ్చింది. అదేరోజు అప్పటి సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టేందుకు అంచనాలు వేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రాణహిత ఖర్చు రూ.38 వేల కోట్లు, కాళేశ్వరం మొత్తం ఖర్చు లక్ష కోట్లపైమాటే

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్లు అంచనా అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను 80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టింది. ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం 2022లో కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.1 లక్షా 27 వేల కోట్లు. ఆ తరువాత కాళేశ్వరం ఖర్చు రూ.1 లక్షా 47 వేల కోట్లు అవుతాయని స్పష్టమవుతోంది. రూ.38 వేల కెోట్లతో ముగిసిపోవాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఏకంగా రూ.1 లక్షా 47 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. మేడిగడ్డలో 6 పిల్లర్లు కుంగిపోయాయి. ఆ మూడు బ్యారేజీలతో 2019 నుంచి 2023 వరకు 162 టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోశారు. ఏడాదికి 20 టీఎంసీలే లిఫ్ట్ చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు నీళ్లు అందలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

ఏడాదికి 190 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పి నాలుగైదేళ్లు కలిపి 162 టీెఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. ఇందులో 32 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా వదిలారు. అంటే లిఫ్ట్ చేసింది 130 టీఎంసీలు.. 10 శాతం ఎవాపరేషన్ లాస్ తీసివేస్తే నెట్ వాటర్ 114 టీఎంసీలు మాత్రమే. ఇందులో 13 టీెంసీలు కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లో స్టోరేజీ ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది 101 టీఎంసీలు. ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే రైతులకు వినియోగంలోకి వచ్చాయి. 38 వేల కోట్ల ప్రాణహితను పక్కనపెట్టి 1 లక్షా 47 వేల కోట్లకు ఖర్చుకు కాళేశ్వరాన్ని చేపట్టారు.