పంజాబ్ కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. పంజాబ్ కి చెందిన మల్లికా హందా చెస్ క్రీడాకారిణి. చెస్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు గెలిచినా తనకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, అమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వైకల్యాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మల్లికాకు సహకారం అందించేందుకు మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్ లోని జలంధర్ నుంచి ఆమెను హైదరాబాద్ పిలిపించి ఆర్థిక సహాయం చేశారు.


Also Read:  చిన జీయర్ స్వామి వద్దకు సీఎం కేసీఆర్.. యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణపై చర్చ, రామానుజుల విగ్రహ పరిశీలన






దివ్యాంగ క్రీడాకారులకు ప్రోత్సాహం


ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మల్లికా హందాకు తగిన ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ అమెకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ఒక ల్యాప్ టాప్ ను అందించి, ఆమెని సన్మానించారు. మూగ చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కేటీఆర్ మల్లికాతో మాట్లాడారు. మంత్రి మల్లికాకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావన్నారు. మల్లికా సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతుందని, మరింత సహాయం, ప్రశంసలు అందుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం వైకల్యం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే పాలసీని తయారు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ పాలసీతో ముందుకు వచ్చేందుకు తనకెదురైన అనుభావాల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మల్లికా హందాకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను మంత్రి కేటీఆర్ కోరారు. 



Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి