Minister KTR: రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే టీపాస్, ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేదని పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈక్రమంలోనే తెలంగాణ టాయ్స్‌ పార్క్‌కు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మృదువైన బొమ్మలు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, నాన్ టాక్సిక్, సిలికాన్ బొమ్మలతో పాటు పర్యావరణ అనుకూలమైన బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్ఐఐసీఎల్టీడీ ద్వారా అభివృద్ధి చేయబడిన తెలంగాణ టాయ్ పార్క్.. స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వీరందరికి కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. 






భారతదేశం నుంచి బొమ్మల ఎగుమతిలో తెలంగాణ పవర్ హౌజ్ గా మారింది. ఈ పార్కులో టాయ్ మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సదుపాయం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్ సౌకర్యం కూడా ఉన్నాయని మంత్రి కేటీర్ వివరించారు. 16 మంది కాబోయే బొమ్మల తయారీ పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చారు. దీనివల్ల దాదాపు 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురగోతి సాధించిందిని తెలిపారు. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో సమగ్ర, సమతుల్యత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందని కేటీఆర్ వివరించారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. 






మానవ చరిత్రలో మూడో అతిపెద్ద కార్యక్రమం హరితహారం కార్యక్రమేనని అన్నారు. భవిష్యత్తు తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలకు పలు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్లు కనుమరుగు అయ్యారని పేర్కొన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిది ఏళ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారంటూ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుందని అమెరికా ఇంజినీర్లు కూడా అన్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అది తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం అని వివరించారు.