TSRTC News: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలిపారు. ఈరోజు తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంఘ ప్రతినిధి బృందం మంత్రులు కే తారక రామారావు, హరీష్ రావు, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చింది. మజ్దూర్ యూనియన్ కు ఆర్టీసీ అధికారిక యూనియన్ గా ప్రభుత్వం గుర్తించడంతో కార్మికుల సమస్యలను ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కలిగిందని థామస్ రెడ్డి అన్నారు.


భవిష్యత్తులోనూ ఆర్టీసీ అభివృద్ధి పథంలో..


రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు.. తెలంగాణ సర్కారుతో ఉన్న  సోదర బంధం వల్లనే అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఒకటి రెండు అంశాలపై కూడా మంత్రులు సానుకూలంగా స్పందించారని థామస్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఆర్టీసీ భవిష్యత్తులోనూ అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఇది అని థామస్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.


హైదరాబాద్ చూడాలనుకునే వారికి ఆర్టీసీ ఆఫర్‌- వీకెండ్‌లో స్పెషల్ టూర్


ఇటీవలే భాగ్యనగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను 12 గంటల్లోనే సందర్శించేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ దర్శిని పేరుతో సిటీ టూర్ బస్సులతో సేవలు ప్రారంభించింది. ప్రతి శని, ఆది వారాల్లో వీటిని నడపబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. కేవలం 12 గంటల సమయంలోనే హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు.






ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే..?


శని, ఆది వారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. బిర్లా మందిర్, చౌమెహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్కు తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 


ఎవరికి ఎంత ఛార్జీలు అంటే?


మెట్రో ఎక్స్ ప్రెస్ లలో పెద్దలకు 250, పిల్లలకు 130 రూపాయలు. అలాగే మెట్రో లగ్జరీ బస్సుల్లో పెద్దలకు 450, పిల్లలు 340 రూపాయలు.