Telangana Liberation Day Celebrations 2024: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 'ప్రజాపాలన' దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గన్ పార్క్ (Gun Park) వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో (Public Garden) జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత 'ఓ నిజాము పిశాచమా... కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..' అన్న దాశరథీ కవితతో తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని.. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని అన్నారు. '4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు. నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను మట్టి కరిపించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. ఇది ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఆనాటి పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి.' అని సీఎం పేర్కొన్నారు.
'అందుకే ఆ పేరు పెట్టాం'
'తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటివరకూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. లోతైన ఆలోచన తర్వాత 'ప్రజా పాలన దినోత్సవం'గా ఈ రోజును జరుపుకోవడం సముచితంగా ఉంటుందని భావించాం. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి... ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావులేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. అందుకే ఆ పేరు పెట్టాం.' అని సీఎం రేవంత్ వివరించారు.
'ఫామ్ హౌస్ సీఎంను కాదు'
'ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గళమెత్తి వినిపించిన అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారుచేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు యత్నిస్తున్నాం. నా ఢిల్లీ పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్ ముఖ్యమంత్రిని కాదు... పని చేసే ముఖ్యమంత్రిని. ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్ స్టేట్’’గా బ్రాండ్ చేస్తున్నాం. యువత భవితకు పెనుసవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. టీ - న్యాబ్ బలోపేతం చేశాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి... ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. గత పదేళ్ల పాలకుల పాపంతో ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోయింది. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం. ఇది ఓ ప్రకృతి యజ్ఞం. ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. సెప్టెంబర్ 17 ఇకపై ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.