తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,944 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,51,099కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,081కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 39,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,444 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,07,498కి చేరింది.
15 ఏళ్లు వచ్చిన వాళ్లు అర్హులే
కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 జనవరి నాటికి 15 ఏళ్లు నిండిన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. 15- 18 ఏళ్ల మధ్య వయసు వారితో పాటు వీరు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. 2005, 2006, 2007 సంవత్సరాల్లో పుట్టిన వారు కూడా ఈ 15-18 ఏళ్ల కేటగిరీలోకే వస్తారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీకి చెందిన 59 శాతం మంది పిల్లలు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొంది.
కొత్త వేరియంట్
కరోనా థర్డ్ వేవ్‌తో ఇప్పటికే బెంబేలెత్తిపోతోన్న దేశాన్ని ఇప్పుడు దాని సబ్ వేరియంట్ BA.2 భయపెడుతోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను టెస్ట్ చేస్తే గతంలో వారిలో ఒమిక్రాన్ వేరియంట్ BA.1 కనిపించేదని.. కానీ, ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఎక్కువగా కనిపిస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు.
కోవిడ్ పరిస్థితి..
ప్రస్తుతం దేశంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ 2 లక్షలకు పైగానే ఉందని సీనియర్ అధికారి లవ్ అగర్వాల్ అన్నారు.
" 11 రాష్ట్రాల్లో 50,000కు పైగానే కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 14 రాష్ట్రాల్లో 10,000 నుంచి 50,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి 26 వరకు గణాంకాలను పరిశీలిస్తే 400 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే ఉంది. 141 జిల్లాల్లో ఇది 5 నుంచి 10 శాతంగా ఉంది."
ఏ రాష్ట్రంలో ఎలా?
మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఒడిశా, హరియాణా, బంగాల్‌లో కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లో మాత్రం భారీ సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.