Telangana CM Revanth Reddy about Govt Jobs: హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల (Govt Jobs in Telangana) ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలపై ఫోకస్ చేపట్టామన్న రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)పై ఇదివరకే స్పందించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చారు. డిసెంబర్ 9 2024 లోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యోగార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


గత ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ తమిళిసై ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని, ఎవరూ ఆందోళన చెందొద్దని నిరుద్యోగులకు సూచించారు.






కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు సైతం విడుదల చేసిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను సైతం భర్తీ చేయకపోగా, పేపర్ లీక్స్ జరగడం బాధాకరం అన్నారు. అసలే బీఆర్ఎస్ సర్కార్ తమకు జాబ్స్ ఇవ్వలేదని, కాంగ్రెస్ వచ్చాక ఇంకా ప్రకటన చేయలేదని విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారని.. ఆందోళన అవసరం లేదన్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమించి ఉద్యోగ భర్తీ ప్రకటనను చేపడతామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని వారికి భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.