Anchor Shyamala Got Relief In Telangana Highcourt On Betting Apps Issue: బెట్టింగ్ యాప్ వ్యవహారంలో (Betting Apps Case) ప్రముఖ యాంకర్, నటి శ్యామలకు (Anchor Shyamala) తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చెయ్యొద్దంటూ ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చి దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.
ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటిషన్
బెట్టింగ్ యాప్ కేసులో తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం అరెస్ట్ నుంచి ఊరట కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖలు జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
అటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపైనా కేసులు నమోదయ్యాయి. అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, నయని పావని, అమృత చౌదరి, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై చర్యలు చేపట్టారు.
Also Read: క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
సినీ ప్రముఖుల వివరణ
మరోవైపు, ఈ కేసుపై ప్రముఖ నటుడు రానా టీం స్పందించింది. బెట్టింగ్ యాప్స్‌నకు ఆయన ప్రచారం చేయడంపై వివరణ ఇచ్చింది. 'నైపుణ్యం ఆధారిత గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా.. దీని గడువు 2017లోనే ముగిసింది. ఆన్ లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటినే రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా లీగల్ టీం అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్ ఫాంను రానా అంగీకరించాడు. ఈ గేమ్స్ అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయి. అందువల్లే చట్టబద్ధంగా అనుమతిస్తున్నట్లు కోర్టు తీర్పిచ్చింది.' అని రానా టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఈ అంశాలపై విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ ఇతర ప్రముఖులు సైతం క్లారిటీ ఇచ్చారు.
వారిపై చర్యలు కోరుతూ 'మా'కు లేఖ
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన వేళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) స్పందించింది. సినిమా వారైనా.. వేరే ఎవరైనా చట్టం, న్యాయానికి లోబడి ఉండాలని తెలిపింది. కొంతమంది తెలిసి.. కొంతమంది తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. 'బెట్టింగ్ యాప్స్ వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే అది కచ్చితంగా తప్పే. సంబంధిత యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని 'మా'కు లేఖ రాస్తాం.' అని ఓ ప్రకటనలో పేర్కొంది.