Runa Mafi: ఆగస్టు 15లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల రుణాలు మాఫీ చేయాలని సంకల్పించిన తెలంగాణ(Telangana)  ప్రభుత్వం..అందుకు తగ్గట్లుగా లబ్ధిదారుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పేద రైతులెవ్వరూ నష్టపోకూడదంటూనే...అనర్హులకు సైతం ఒక్కపైసా ముట్టచెప్పకూడదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను గట్టిగానే హెచ్చరించారు. దీంతో రైతు రుణమాఫీ(Runamafi) మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుదారులను రాజకీయ నేతలను, ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐటీ(IT) రిటర్న్‌ దాఖలు చేసే రైతులు, చిరు ఉద్యోగులను మాత్రం ఇందులో నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


రైతు రుణమాఫీ మార్గదర్శకాలకపై కసరత్తు
రైతు రుణమాఫీకి అర్హత పొందే లబ్ధిదారుల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైన వ్యవసాయశాఖ అధికారులు...పకడ్బందీగా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. దీని ప్రకారం అసలు రాష్ట్రంలో ఐటీ కడుతున్న వారు ఎంతమంది..? పన్ను కట్టకపోయినా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్న వారు ఎంతమంది..? అనే వివరాలను కేంద్రం నుంచి తెప్పించుకున్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ (PM-Kisan)పథకంలోనూ  ఐటీ చెల్లింపుదారులు, రాజకీయ నేతలను మినహాయించారు. ఈక్రమంలోనే పన్ను చెల్లించేవారిని రుణమాఫీ నుంచి మినహాయించే అవకాశం ఉంది. అయితే పిల్లల చదువుకోసం, ఇంటి నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న కొందరు రైతులు...పన్నులు చెల్లించకున్నా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ(Runamafi) వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఎం-కిసాన్ పథకం మార్గదర్శకాలనే  దాదాపు రైతురుణమాఫీకి వర్తింపజేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ  ఎక్కువ జీతం తీసుకునేవారిని మినహాయించి...చిరుద్యోగులకు మాత్రం రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే గత ప్రభుత్వాలు అందరికీ రుణమాఫీ వర్తింపజేయడం వల్ల ప్రజాధనం వృధాకావడమే గాక...ప్రభుత్వంపైనా భారం పడింది. అందుకే ఈసారి బడాబాబులకు , రాజకీయ నేతలను మినహాయించడం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మరింత న్యాయం చేయాలని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం భావిస్తోంది. రెండు రోజుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు  విడుదల కానున్నాయి.


ఆగస్టు 15న రైతు రుణాలు మాఫీ
రాష్ట్ర ప్రభుత్వం రైతురుణమాఫీ(Runamafi) అమలకు ఆగస్టు 15 డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. రెండు, మూడురోజుల్లో మార్గదర్శకాలతో కూడిన జీవో విడుదల కానుంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతుల నుంచి స్వీకరించనున్నారు. రైతు రుణాలు మాఫీకి దాదాపు 31వేల కోట్లు అవసరం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత నిధులు సేకరించిన ప్రభుత్వం..ఈనెల రోజుల్లోనే మిగిలిన నిధులను సమకూర్చుకోనుంది. అటు లబ్ధిదారుల ఎంపికపైనా బ్యాంకులు  తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేషన్‌కార్డు(Ration Card), సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రైతుల గుర్తింపు జరుగుతోంది. ఆధారాకార్డు(Aadhar)ల ద్వారా నెంబర్లు సరిచూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎన్నికలహామీలో రైతురుణాలమాఫీ అంశం అత్యంత కీలకమైనది.అధికారంలోకి వచ్చిన అర్హులైన లబ్ధిదారులందరికీ 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రుణమాఫీ అంశం గత ఎన్నికల్లో కీలకంగా మారింది.ఒకరకంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో ఉపయోగకరమైన ఈ హామీని అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదని తేల్చిచెప్పారు. ఆగస్టు 15 కల్లా రైతుల రుణాలు మాఫీ చేస్తానంటూ డెడ్‌లైన్ విధించారు.