TS Rains Effect : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మూడు రోజులు సెలవులు ప్రకటించారు అధికారులు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జల్లులు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజుల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మాన్ సూన్ టీమ్‌లు, విపత్తు స్పందక టీమ్‌లను అప్రమత్తం చేశారు.
సీఎం కేసీఆర్ సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉంటూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధాలుండే అన్ని శాఖలు నిరంతరం పనిచేసే విధంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. భారీ వానల నేపథ్యంలో ఎగువ గోదావరి నుంచి వరద ముంచుకొస్తున్నందు వల్ల ఎస్సారెస్పీలో నీరు చేరుతున్న పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అధిక వర్షాలు కురుస్తున్నందున ఆ జిల్లాపై ఎక్కువ దృష్టిని సారించి, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రెస్య్కూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అవసరమైనచోట హెలికాప్టర్ లను వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
బయటకు రావొద్దు
రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ముంపు పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకొకసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లను ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేయాలన్నారు. ఏటూరు నాగారం, రామన్న గూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎస్ కు సూచించారు. వానల నేపథ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంటవెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డి సీఎంకు తెలియజేశారు.
కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేకంగా సురక్షిత చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అదే విధంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
ఆ జిల్లాల్లో మరింత అప్రమత్తం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల్ పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఈ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. ఇప్పటికే అన్ని చెరువులు, కుంటలు నిండాయని, వాటి వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలన్నారు.