Interner Connection For 300 Rupees: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ (Interner Connection) అందుబాటులోకి వచ్చేలా అడుగులు వేస్తోంది. ఇది వైఫై కనెక్షన్ వంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామస్థులు చూడడానికి వీలు పడుతుంది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం 'భారత్ నెట్' (Bharat Net) పేరుతో దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఓ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని సర్కారు నిర్ణయించింది. టీ ఫైబర్ సంస్థ ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను తీసుకుంది.
టీవీనే కంప్యూటర్‌గా..
ఈ కనెక్షన్ తీసుకుంటే ప్రతీ ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి రూ.300కే.. 20 ఎంబీబీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇస్తారు. దీంతో చెల్లింపులు కూడా చెయ్యొచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా కనెక్షన్ ఇవ్వనున్నారు. టీవీనే కంప్యూటర్‌గా మారుతుండడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ జంక్షన్లు, ఇతర చోట్ల కూడా అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైబర్ నెట్‌తో (Fiber Net) అనుసంధానం చేయబోతున్నారు. ఇవి ప్రతి పోలీస్ స్టేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమవుతాయి.
'ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు'
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ - ఫైబర్ లక్ష్యమని సంస్థ ఎండీ వేణుప్రసాద్ తెలిపారు. 'టీ ఫైబర్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (T NOC) నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాం. 94 మండలాల్లో, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు తొలి దశలో 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు చేశాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పీవోసీ)లో భాగంగా తొలి దశలో మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్‌పూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ఈ నెల 8న సీఎం రేవంత్ ప్రారంభిస్తారు.' అని వెల్లడించారు.