తెలంగాణలో నేటి నుంచి (సెప్టెంబర్ 1) పాఠశాలలను పున:ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలను మూసివేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగతా అన్ని పాఠశాలల్లోనూ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలో క్లాసులు కొనసాగించాలని ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో గురుకులాలు మినహా మిగతా అన్ని పాఠశాలల్లో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు కచ్చితంగా హాజరు కావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని సూచించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విద్యా సంస్థలదే తుది నిర్ణయం..
రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ.. హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో క్లాసుల నిర్వహణ అధికారాన్ని విద్యా సంస్థలకే పూర్తిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థలదే తుది నిర్ణయమని పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించాలనుకునే పాఠశాలలకు వారం లోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యా శాఖను ఆదేశించింది. స్కూళ్లలో పాటించే కోవిడ్ మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని విద్యా శాఖకు సూచించింది.
కోవిడ్ మూడో దశ నేపథ్యంలో..
తెలంగాణలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయని ప్రస్తావించింది. బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. ఈ రెండు అంశాలను సమన్వయం చేసి చూడాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.