Singareni Workers: త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఈసీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. గత మూడు రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్‌లో ఎన్నికల సన్నద్దతపై అధికారులతో సమీక్షిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల తుది జాబితా విడుదల చేయగా.. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎన్నికల ప్రచారాన్ని పార్టీలన్నీ ముమ్మరం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి.


గత రెండు ఎన్నికల్లో విజయఢంకా మోగించి అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్.. ఈ సారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ పరంగా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను మరింత షురూ చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, డీఏ విడుదల వంటి నిర్ణయాలు తీసుకుంటూ వారిని కూడా సంతృప్తి పరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందింది. దసరా పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించింది. దసరా కానుకగా వీటిని అందించనుంది.  ఇటీవల బోనస్ ప్రకటించగా.. ఇవాళ అందుకోసం నిధులు కూడా విడుదల చేసింది. కార్మికులకు బోనస్ ఇచ్చేందుకు రూ.711.18 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.


ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో త్వరలోనే సింగరేణి కార్మికుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ కానున్నాయి. ఈ నెల 16వ తేదీన జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఒక్కో సింగరేణి కార్మికుడికి దాదాపు రూ.1.53 లక్షల దసరా బోనస్ అందనుంది. దీంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ ప్రకటించినందుకు ప్రభుత్వానికి  ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే ప్రతీ ఏడాది పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సందర్బంగా బోనస్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఈ సారి ఎన్నికలు ఉండటంతో కొంచెం ముందుగానే బోనస్ నిధులు విడుదల చేస్తున్నారు. ఒకసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే నిధులు విడుదల చేయడానికి వీలు పడదు. విడుదల చేయాలని భావించినా.. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే బోనస్ నిధులు విడుదల చేసింది.


అటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈ నెలలో జరగాల్సి ఉంది. కానీ ఎన్నికలను 11వ తేదీ వరకు స్తంభింపజేయాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో సింగరేణి ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం సుముఖంగా కనిపించడం లేదు. దీంతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.  ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా.. ప్రతీసారి వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.