Bedbugs Invasion in France:


ఫ్రాన్స్‌లో నల్లుల దండయాత్ర..


ఫ్రాన్స్‌కి నల్లులు (Bedbugs in France) చుక్కలు చూపిస్తున్నాయి. కొద్ది వారాలుగా వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. పారిస్‌, మర్సేలీతో పాటు దాదాపు అన్ని సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ...పారిస్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. 2024లో ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్‌ ( 2024 Olympics in France) జరగనున్నాయి. ఇందుకు మరో 10 నెలల సమయముంది. వేసవిలో ఈ నల్లుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. హోటల్స్‌తో పాటు అన్ని వెకేషన్‌ రెంటల్స్‌లో నల్లులు తెగ ఇబ్బంది పెట్టాయి. ఆ తరవాత సినిమా థియేటర్లలోనూ అందరినీ కుట్టాయి. అంతే కాదు. హైస్పీడ్ ట్రైన్స్‌లోని కుర్చీల్లో, పారిస్ మెట్రో సిస్టమ్‌లోనూ నల్లులు కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇవే ఉంటున్నాయి. నల్లుల్ని కంట్రోల్ చేసే కంపెనీలకు డిమాండ్‌ అనూహ్య స్థాయిలో పెరిగింది. కొన్ని చోట్ల పని చేసేందుకు కూడా ఖాళీ దొరకనంతగా బిజీగా అయిపోతున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే ఒలింపిక్స్ జరిగే నాటికి ఆతిథ్యం ఇవ్వడం పారిస్‌కి చాలా కష్టమవుతుంది. ఒలింపిక్స్‌తో పాటు పారాలింపింక్ గేమ్స్‌కి వచ్చే విజిటర్స్‌ భారీ సంఖ్యలో ఉంటారు. వాళ్లు వచ్చినప్పుడు కూడా నల్లులు ఇలాగే ఇబ్బంది పెడితే మొత్తం దేశానికే చెడ్డ పేరు. ముఖ్యంగా పారిస్ సిటీ హాల్‌కి వచ్చే విజిటర్స్‌ని నల్లులు మరింత చికాకు పెట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి...ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పారిస్‌ డిప్యుటీ మేయర్ ఎమ్మాన్యుయేల్ గ్రెగోయిర్..ప్రధాని ఎలిజబెత్ బోర్న్‌కి లేఖ రాశారు. జాతీయ స్థాయిలో ఈ సమస్యని పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ అవసరమని సూచించారు. 


కనిపెట్టడం కష్టం..! 


కంటికి కనిపించనంత చిన్నగా ఉండడం వల్ల ఈ నల్లుల్ని వెతికి చంపడం (Bedbugs Invasion) చాలా కష్టమవుతోంది. పైగా అవి ఎక్కువగా పరుపులు సహా మెత్తటి సోఫాల, కర్టెయిన్స్‌ కింద దాక్కుని ఉంటాయి. ఎలక్ట్రికల్ సాకెట్‌లు, వాల్‌పేపర్‌లు..ఇలా ఎక్కడ పడితే అక్కడ నక్కి ఉంటాయి. రాత్రి పూట బయటకి వచ్చి అందరినీ కుడతాయి. రక్తం తాగుతాయి. కొంత మంది టూరిస్ట్‌లు తెలియకుండానే...తమ సూట్‌కేసుల ద్వారా ఈ నల్లుల్ని ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌లో వాళ్లు ప్రయాణించినప్పుడు బస్‌ల సీట్‌లు, మెట్రో రైళ్ల సీట్‌ల కిందకు నక్కుతాయి. ప్రయాణికులు వచ్చి కూర్చున్నప్పుడు మెల్లగా బయటకు వచ్చి కుట్టడం మొదలు పెడతాయి. పైగా ఇవి చాలా తొందరగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. హైజీన్‌గా ఉన్న ప్రాంతాల్లోనూ చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి. ఈ నల్లుల దెబ్బకి పారిస్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ అలెర్ట్ అయింది. ప్రయాణికుల సేఫ్‌టీపై దృష్టి సారించింది. ఇప్పటికే పలు సంస్థలు స్పెషల్‌గా మీటింగ్ కూడా పెట్టుకున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సేవలు ఎలా అందించాలో చర్చించుకున్నాయి. ఇది జాతీయ స్థాయి సమస్య అవుతుందని ఫ్రాన్స్‌ అసలు ఊహించలేదు. చాలా తొందరగా అన్ని సిటీల్లోకి వ్యాపించాయి నల్లులు.