హైదరాబాద్‌: మహిళలు తమ కాళ్లపై నిలబడేలా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో మహిళలను ప్రభుత్వం భాగస్వాములు చేసింది. తాజాగా రైస్‌మిల్లుల పరిశ్రమలో వారికి అవకాశాలు కల్పించాలని భావించి అందుకు కార్యాచరణను ప్రారంభించింది. మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు ప్రతి మండలంలో ఒక రైస్‌మిల్లు నిర్మించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. 

ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లులు ఏర్పాటు, గోదాములు నిర్మించి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో మహిళా సమాఖ్యలు ఉన్నాయి. మొత్తం 553 మండల మహిళా సమాఖ్యలు ఉండగా.. గ్రామస్థాయిలో 18000 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మహిళా సమాఖ్యలున్న మండలాలకు ఒక్కో రైస్‌మిల్లు చొప్పున మంజూరు చేస్తే మొత్తం 553 రైస్ మిల్లులను నిర్మించి వారికి అందించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.37 లక్షల స్వయం సహాయక సంఘాలు (SHG) ఉండగా.. వాటిలో సభ్యులుగా 47.40 లక్షల మంది మహిళలు ఉన్నారు. 

ఒక్కో మిల్లుకు వ్యయం ఎంత..అన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలంటే ఒక్కో ఒక్కోరై్‌సమిల్లుకు దాదాపు రూ. 3.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు మెషినరీ మన దగ్గరే లభిస్తుంది. గంటకు 4 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న మెషీన్లు కొనుగోలు, వాటిని మిల్లులలో బిగించి అంతా సిద్ధం చేయడానికి రూ. 1.10 కోట్ల వరకు అవుతుంది. వీటికి అదనంగా మట్టిపెళ్లలు, బెరుకులను వేర్వేరు చేసి తొలగించే యంత్రాలను కల్పించడానికి మరో రూ.75 లక్షలు వెచ్చించాలి. భవన నిర్మాణం, మెషీన్లు, విద్యుత్, నీటి సరఫరా, ఇతర అన్ని సదుపాయాలతో కలుపుకుంటే ఒక్కో రైస్ మిల్లుకు రూ.3.50 కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు.