Indiramma Houses | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబు సైజుపై స్పష్టమైన పరిమితులు విధిస్తూ ప్రభుత్వం ఈ గైడ్‌లైన్స్ ఇచ్చింది. కొత్త జీవో ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల స్లాబు విస్తీర్ణం 500 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిబంధనలతో పాటు స్లాబు ప్రొజెక్షన్ల (ముందుకొచ్చే భాగాలు) పై కూడా గృహనిర్మాణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇంటి స్లాబు ముందువైపు కేవలం 3 అడుగులు, మిగతా మూడు వైపులా కేవలం ఒక అడుగు వరకు మాత్రమే ప్రొజెక్షన్ ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్లాబు విస్తీర్ణం పరిమితికి మించి పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విస్తీర్ణ పరిమితులను విధించినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటే ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' ఒకటి. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలే రాని రోజును చూడాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు శాశ్వతమైన, సురక్షితమైన ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఏకంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డబ్బును ప్రభుత్వం 100 శాతం రాయితీ (సబ్సిడీ) రూపంలో ఇస్తుంది, ఇది ఎలాంటి అప్పు కాదు. దాంతో పేద కుటుంబాలపై ఎలాంటి తిరిగి చెల్లించే భారం కానీ, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కానీ ఉండదు.
ఈ పథకం ఇటు స్థలం ఉన్నవారికీ, అటు స్థలం లేని నిరుపేదలకూ ఇద్దరికీ అండగా నిలుస్తుంది. ఇప్పటికే సొంతంగా చిన్న స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బుల్లేని పేదలకు.. బేస్‌మెంట్, గోడలు, స్లాబ్ మరియు ఇల్లు పూర్తయ్యే దశలను బట్టి విడతలవారీగా ఈ 5 లక్షల రూపాయల నిర్మాణ నిధులను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కనీసం ఇళ్ల స్థలం కూడా లేని అత్యంత నిరుపేదలకు, ప్రభుత్వం ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయించడంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఈ 5 లక్షల గ్రాంట్‌ను కూడా అందిస్తుంది.
సమాజంలో స్త్రీలకు మరింత భద్రతను, సమానత్వాన్ని కల్పించేందుకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిట మాత్రమే మంజూరు చేస్తారు. అంతేకాకుండా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (OBC), మైనారిటీలు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి సరైన మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులతో గౌరవంగా బతికే అవకాశం లభిస్తుంది.
