Beijing Central Business District Plane Crash: చైనా రాజధాని బీజింగ్‌లో అత్యంత కట్టుదిట్టమైన వైమానిక రక్షణ వలయం ఉండే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోనే అత్యంత ఎత్తైన భారీ భవనమైన జున్ సీఐటీఐసీ టవర్ ను ఒక చిన్న విమానం వేగంగా ఢీకొట్టింది. 108 అంతస్తులతో, సుమారు 528 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ భవనం పైభాగంలో సుమారు 65వ అంతస్తు సమీపంలో విమానం బలంగా గుద్దుకోవడంతో భారీ శబ్దం వచ్చింది. కారు పరిమాణంలో ఉన్న ఈ విమానం ఢీకొన్న ధాటికి భవనం తాలూకు గ్లాస్ ప్యానెల్స్ ముక్కలై, విమాన శకలాలు , గాజు ముక్కలు వర్షంలా కింది వీధులపై పడ్డాయి.
హుటాహుటిన భవనం ఖాళీ.. రంగంలోకి అత్యవసర బలగాలు
ఈ ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో భారీ పేలుడు లాంటి శబ్దం రావడంతో ఫైర్ అలారమ్‌లు మోగాయి. భయాందోళనకు గురైన లోపలి ఉద్యోగులు లిఫ్టులను వాడకుండా మెట్ల ద్వారా వందలాది అడుగుల కిందకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే డజన్ల కొద్దీ అగ్నిమాపక శకటాలు, అంబులెన్సులు, వందలాది మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భవనం కింద పడిన విమాన శకలాల వద్ద రేగిన మంటలను ఆర్పివేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ ఎవరూ రాకుండా భారీ కాపలాను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం, క్షతగాత్రుల వివరాలను చైనా అధికారిక యంత్రాంగం ఇప్పటివరకు వెల్లడించలేదు.
దారి తప్పిన పైలట్
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ప్రమాదానికి గురైన విమానం చైనాలోనే తయారైన సన్‌వర్డ్ ఎస్ఏ 60ఎల్ అరోరా గా గుర్తించారు. ఇది తూర్పు బీజింగ్‌లోని షిఫోసి ఎయిర్‌ఫీల్డ్ నుండి ఒక ఫ్లయింగ్ స్కూల్ ద్వారా టేకాఫ్ అయింది. విమానం తిరిగి ల్యాండ్ కావాల్సిన మార్గాన్ని విడిచిపెట్టి, అనూహ్యంగా 270 డిగ్రీల కోణంలో బీజింగ్ నగర కేంద్రం వైపు దూసుకొచ్చింది. అత్యంత కఠినమైన వైమానిక ఆంక్షలు, డ్రోన్లపై కూడా నిషేధం ఉన్న బీజింగ్ నో-ఫ్లై జోన్‌లోకి ఈ విమానం ఎలా ప్రవేశించింది? దీని వెనుక సాంకేతిక లోపం ఉందా లేక మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఫోన్ల గుర్తింపు.. సోషల్ మీడియాపై సెన్సార్ల దాడి
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, కొరియర్ బాయ్స్ తమ మొబైల్ ఫోన్లలో భవనానికి జరిగిన నష్టాన్ని, కింద పడిన శకలాలను రికార్డ్ చేయడం ప్రారంభించారు. అయితే, రంగంలోకి దిగిన చైనా పోలీసులు, భద్రతా సిబ్బంది నడిరోడ్డుపై ప్రజలను చుట్టుముట్టి వారి ఫోన్లను లాక్కున్నారు. తీసిన ఫోటోలు, వీడియోలను బలవంతంగా డిలీట్ చేయించారు. చైనాకు చెందిన వైబో , గ్లోబల్ నెట్‌వర్క్స్, ఎక్స్‌హోంగ్‌షు వంటి సాషల్ మీడియా యాప్స్ నుండి ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల ఫుటేజీలు, హ్యాష్‌ట్యాగ్‌లను ఇంటర్నెట్ సెన్సార్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా తొలగించాయి.
రహస్యాల వెనుక చైనా కప్పిపుచ్చే వ్యూహం
చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చైనాలో ఇలాంటి సున్నితమైన ప్రమాదాలు లేదా భద్రతా వైఫల్యాలు జరిగినప్పుడు వాటిని కప్పిపుచ్చడం ప్రభుత్వానికి అలవాటేనని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ శాఖ కానీ, బీజింగ్ మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రభుత్వం దీనిని రహస్యంగా ఉంచాలని చూస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మీడియా ద్వారా ఈ 'చైనా జున్ టవర్' విమాన ప్రమాద వార్త ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది.
