Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభలో సమగ్ర సర్వేపై తీర్మానం చేశారని తెలిసిందే. దాంతో ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరపనున్న ఈ ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) జీవో 18 జారీ చేశారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేకు నోడల్ బాధ్యతలను ప్రణాళిక శాఖకు ప్రభుత్వం అప్పగించింది.


గతంలో తొలిసారి సమగ్ర కుటుంబ సర్వే


గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆర్థిక, సామాజిక, కుల, విద్య, ఉపాది లాంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడంతో ఇంటింటా సర్వేకు లైన్ క్లియర్ అయింది. ఈసారి సర్వే ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం కీలకంగా మారతాయి.


అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరిచేందుకు సర్వే


రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరచాలని సమగ్ర కుటుంబ సర్వేకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఇంటింటా సర్వే చేయాలని ఫిబ్రవరి 4న తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభలో ఆమోదించారు. ఈ మేరకు సమగ్ర కుల సర్వే (Caste Census) చేసేందుకు బీసీ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన కమిషన్‌ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రిపోర్ట్ అందించనుంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బిహార్‌లో చేపట్టిన కుల సర్వే, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. 


సమగ్ర కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు
కుల సర్వే వెంటనే చేపట్టాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్‌ సమావేశంలో ఆదేశించగా.. అందుకు తగినంత యంత్రాంగం లేదని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. ఈ క్రమంలో ప్రణాళిక విభాగంతో కలిసి సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 60 రోజుల్లోగా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమగ్ర కుల గణన అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. కులగణననై ప్రభుత్వం ఉత్తర్వులపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


Also Read: Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్