Telangana News :  తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.   నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.  అందులో భాగంగా దీర్ఘ కాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇంటి వద్దకే మందులు అందించనున్నారు.  శుక్రవారం నుంచే హైదరాబాద్ జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆశా వర్కర్లు ఎన్‌సీడీ కిట్స్‌ను పంపిణీ చేయటం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తోంది. షుగరు..బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ కిట్లు పంపిణీ కొనసాగుతోంది.                                                     


 ప్రతి కుటుంబంలో వయసు మీద పడిన వారికి దీర్ఘకాలిక సమస్యలైన బిపి, షుగర్ వంటి వ్యాధులు సర్వసాధారణంగా మారిపోయాయి. వీరంతా ప్రతినెనా మెడికల్ షాపులకి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి పేద ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తుంది. ఈ కిట్లలో బిపి, షుగర్ టాబ్లెట్లను ఉంచి వారికి కావలసిన టాబ్లెట్లను ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి అందజేస్తుంది.                                           


 నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అసంక్రమిత వ్యాధి నివారణ అదుపునకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు మధుమేహాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కిట్లను రూపొందించారు. బిపి, షుగర్ నియంత్రణతో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, కంటి చూపు మందగించడం, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు గురవడం, రక్తనాళాలు దెబ్బ తినడం, పాదాలకు పుండ్లు వంటి దుష్ప్రమైన పరిణామాలు బారిన పడే అవకాశం ఉంది. మందులను క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తూ ప్రభుత్వం ఈ కిట్లను తయారు చేసింది.                                           


ఈ మందులను సులభంగా తీసుకెళ్లేందుకు వీలుగా, మందులను ఉంచుకునేందుకు వీలుగా.. చేతి సైజు బ్యాగులను రూపొందించారు. ఈ బ్యాగుల్లో బిపి, షుగర్ మందులను పెట్టుకోవడానికి వీలుగా కల్పిస్తుంది. ఈ బ్యాగులోనే బీపీ, షుగర్ మందులను పెట్టుకొని వాడుకోవలసి ఉంటుంది.  ఒక్కో వ్యాధి గ్రస్తుడికి నెలకు సరిపడా మందులతో ఈ కిట్లను అందిస్తున్నారు. వీటితో పాటుగా త్వరలోనే న్యూట్రీషన్‌ కిట్లను సైతం  అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గర్భిణుల డేటా సేకరణ, కిట్స్‌ పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు.