Telangana government is struggling with financial problems: తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత తీవ్రమవుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా రిపోర్ట్ హెచ్చరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏప్రిల్-సెప్టెంబర్ వరకు ఫిస్కల్ డెఫిసిట్ రు.45,139 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద ఈ లోటు రూ.54,010 కోట్లు మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆరు నెలల్లోనే 83.58 శాతం లోటు నమోదు అయింది. రెవెన్యూ డెఫిసిట్ రూ.12,453 కోట్లకు పెరిగింది, రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.
అంచనాలను అందని ఆదాయం - పెరిగిపోతున్న లోటు కాగ్ రిపోర్ట్ ప్రకారం, మొదటి ఆరు నెలల్లో మొత్తం రెవెన్యూ రసీదులు రూ.1.22 లక్షల కోట్లు వచ్చాయి, ఇది వార్షిక అంచనా ₹2.85 లక్షల కోట్లలో 42.87 శాతం మాత్రమే. వ్యయాలు రూ.89,394 కోట్లకు చేరాయి, ఇందులో జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలపై ఖర్చు పెరుగుతోంది. జీతాలు రూ. 23,954 కోట్లు, సబ్సిడీలు రూ. 8,124 కోట్లు ఉంది. అప్పులు రూ.45,139 కోట్లకు చేరాయి, ఇది వార్షిక టార్గెట్ అంచనాలో 84 శాతం. డెట్ సర్వీసింగ్ ఖర్చు రూ.14,371 కోట్లకు పెరిగింది. GST కలెక్షన్లు రూ.25,411 కోట్లు అంచనా 42.56 శాతం ఉండగా, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ కలెక్షన్లు తగ్గాయి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ. 22,209 కోట్లు మాత్రమే, ఇది ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారింది.
రోజువారీ ఖర్చులకూ అప్పులపైనే ఆధారం
ప్రభుత్వం ఆదాయంపై కాకుండా అప్పులపై ఎక్కువగా ఆధారపడుతోందని అర్థం చేసుకోవచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ వేగంగా పెరగడం వల్ల రాష్ట్రం FRBM యాక్ట్ పరిధులను దాటిపోయే ప్రమాదంలో పడింది. రెవెన్యూ డెఫిసిట్ పెరగడం రోజువారీ ఖర్చులు కూడా అప్పులతోనే గడవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. జీడీపీలో పెరుగుదల తక్కువ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందిని ఇతర పార్టీలు నిందిస్తున్నాయి. రెవెన్యూ కలెక్షన్లు అంచనాల కంటే తక్కువగా ఉండటం, ఫిస్కల్ డెఫిసిట్ వేగంగా పెరగడం పాలనా అసమర్థతగా విమర్శలు వస్తున్నాయి.
భూముల అమ్మకాలపై ఆశలు - వేగంగా వేలం ప్రక్రియ
అప్పులు కూడా సరిపోక పోతూడటంతో తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాలపైఆశలు పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకాలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.25,000 కోట్లు ఆదాయం పొందాలని ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల వేలాల ద్వారా వేల కోట్లు సంపాదించే ప్లాన్ చేసుకుంటోంది. కొకపేట్, మూసాపేట్ ప్రీమియం ప్రాంతాల్లో 44 ఎకరాల భూములు ఈ-ఆక్షన్‌కు ఉంచారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ వేలాల్లో కనీస ధర ఎకరానికి రూ.70-99 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే రాయదుర్గంలో ఎకరాకు 170 కోట్లకు చొప్పునవిక్రయించారు.
గత ప్రభుత్వ అప్పుల వల్ల తిప్పలని చెప్పి తప్పించుకోలేరుగా !
గత ప్రభుత్వం అప్పులు చేసిందని అందుకే తాము భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ ప్రభుత్వం అన్నాక అన్ని బాధ్యతలు తీసుకుని సమర్థంగా నడపాల్సిందే. గత పాలకులు తప్పు చేశారని..తాము ఏమీ చేయలేమని అంటే అది వైఫల్యం అవుతుంది. ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచడం.. ద్వారా ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.