Childrens Day History and Significance : ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన భారతదేశంలో బాలల దినోత్సవాన్ని(Childrens Day 2025) జరుపుతారు. పిల్లల మనస్తత్వాన్ని గౌరవిస్తూ.. పిల్లల హక్కులైన విద్య, శ్రేయస్సు గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చిల్డ్రన్స్ డే శుక్రవారం రోజున వచ్చింది. ఈ స్పెషల్ డే స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని సూచిస్తుంది. 'చాచా నెహ్రూ' పిల్లల పట్ల చూపించిన అభిమానం, ఆదరణకు గుర్తుగా.. బాలల విద్య, శ్రేయస్సుకోసం దీనిని జరుపుతున్నారు.
బాలల దినోత్సవ చరిత్ర
భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి జరుపుతున్నారు. పిల్లల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు గుర్తుగా దీనిని నిర్వహిస్తున్నారు. పిల్లలే దేశానికి నిజమైన బలం, భవిష్యత్తు అని నెహ్రూ భావించారు. 1964లో ఆయన మరణానంతరం.. నెహ్రూ వారసత్వాన్ని, పిల్లల విద్య, సంక్షేమం కోసం ఆయన చేసిన జీవితకాల అంకితభావాన్ని గౌరవించటానికి భారత ప్రభుత్వం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.
అయితే బాలల దినోత్సవాన్ని ముందు నవంబర్ 20వ తేదీన జరుపుకునేవారు. ఇది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సార్వత్రిక బాలల దినోత్సవం(UN Universal Children’s Day)తో సమానంగా ఉండేది. అయితే పిల్లల పట్ల నెహ్రూకి ఉన్న అభిమానానికి నివాళిగా నెహ్రూ పుట్టినరోజున దీనిని జరుపుకోవాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రైమ్ టైమ్
1889లో అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జన్మించిన పండిట్ నెహ్రూ.. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తరువాత 1947లో స్వాత్యంత్రం వచ్చిన తరువాత దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన తన రాజకీయపరమైన సహకారాలు అందించి గొప్ప నాయకుడిగా నిలిచారు. దేశ పురోగతి ఆ దేశంలోని యువత భుజాలపై ఆధారపడి ఉంటుందని నమ్మేవారు.
బాలల దినోత్సవం ప్రాముఖ్యత
బాలల దినోత్సవం.. పిల్లలపై ప్రేమ, సంరక్షణ, అభివృద్ధికి అవకాశాలు ఇవ్వడంతో పాటు.. పిల్లల మనస్సులను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఒక దేశ పురోగతి పిల్లల చేతుల్లోనే ఉందని.. వారి విద్య, శ్రేయస్సు చాలా ముఖ్యమని జవహర్‌లాల్ నెహ్రూ నమ్మకాన్ని ఈ స్పెషల్ డే హైలెట్ చేస్తుంది.
బాలల హక్కులు, విద్య, సమానత్వం, దుర్వినియోగం, బాల కార్మికుల నుంచి రక్షణ వంటి ముఖ్యమైన సమస్యలను కూడా ఇది హైలైట్ చేస్తుంది. దీనిలో భాగంగా పిల్లలు చదువుకోవడానికి, వారిలోని క్రియేటివిటీని ప్రోత్సహించడానికి, వారు అభివృద్ధి చెందడానికి అవసరమైన, సురక్షితమైన సహాయక వాతావరణాన్ని ఇవ్వడంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.