Travel Safe Service and T Safe App: స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాత్రి పూట ఆడపిల్ల బయటకు వెళ్తే, తిరిగి వచ్చే దాకా ఇంట్లో వాళ్లకి భయమే. ఏ ఆటో వాడు ఏం చేస్తాడో.. క్యాబ్ ఎక్కితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు సైతం భయపడుతుంటారు. ఇంటికి సురక్షితంగా చేరేదాకా గుండెలు అరచేతిలో పెట్టుకుని వెళ్తుంటారు. అసలు రాత్రి దాకా ఎందుకు పగటి ప్రయాణం కూడా కొన్ని కొన్ని సార్లు మహిళలకు, చిన్నారులకు, బలహీనులకు ప్రాణాంతకంగా  పరిణమించే పరిస్థితులున్నాయి. ఇలాంటి  ఇబ్బందుల నుంచి ప్రజలను రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం టీ సేఫ్ సేవలను తీసుకొచ్చింది.

  


ఏంటీ టీ సేఫ్.. 


ఆటో లేదా క్యాబ్ ఎక్కే ముందు మీ చేతిలో ఉన్న ఏదైనా ఫోన్ నుంచి 100కి ఫోన్ చేస్తే.. పోలీసు సేవల కోసం 1, ట్రావెల్ సేఫ్ సేవల కోసం 8 నొక్కమని అడుగుతారు. మనం 8 అంకెను సెలక్ట్ చేస్తే.. ట్రావెల్ సేఫ్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లే.  వెంటనే మిమ్మల్ని  ప్రయాణం కోసం నాలుగు అంకెల పిన్ చూస్ చేసుకొమ్మని అడుగుతారు. అంటే మీరు ఒక నాలుగంకెల నంబర్ ఫోన్‌లో ఎంటర్ చేసి దాన్ని గుర్తుంచుకోవాలి.  ఆ పిన్ చూస్ చేసుకోగానే.. మీకు పోలీసుల నుంచి మీ ప్రయాణం ట్రాక్ చేస్తున్నామంటూ ఓ మెసేజ్ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఏ దారిలో వెళ్తున్నారు.. అనేవి మీ ఫోన్ ద్వారా  పోలీసులు ట్రాక్ చేస్తారు.  మీకు వరుసబెట్టి కాల్స్ చేస్తూనే ఉంటారు. మీరు కాల్ ఎత్తడం మానేసినా, సరిగ్గా స్పందించకపోయినా..  మిమ్మల్ని వెతుక్కుంటూ దగ్గర్లోని పోలీసులు బయల్దేరుతారు.  ఇబ్బందికర పరిస్థితుల నుంచి కాపాడతారు.  అలా కాకుండా ట్రాకింగ్ ఆపేయాలంటే వాళ్లు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రయాణం మొదలెట్టేప్పుడు ఎంటర్ చేసిన కోడ్‌ని తిరిగి ఎంటర్ చేయాలి.   ఈ టీ సేఫ్ సేవలను ఏ ఫోన్ నుంచి అయినా వినియోగించుకోవచ్చు.  స్మార్ట్ ఫోనే అయి ఉండాల్సిన  అవసరం లేదు.   మీ ప్రయాణం పూర్తై మీరు తిరిగి పాస్ కోడ్ ఎంటర్ చేసే వరకు మిమ్మల్ని పోెలీసులు ట్రాక్ చేస్తూనే ఉంటారు. 


యాప్ సేవలూ లభ్యం.. 


టీ సేప్ సేవలను స్మార్ట్ ఫోన్ల ద్వారా మరింత వేగంగా పొందొచ్చు. ఎందుకంటే తెలంగాణా ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా యాప్ ను  రూపొందించింది.   దీంట్లో మనల్ని మానిటర్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు కావల్సినప్పుడు ఎంచుకున్న కోడ్ ద్వారా మానిటరింగ్ ని ఆపేయొచ్చు. లొకేషన్ సైతం యాక్యురేట్ గా పోలీసులకు అందుబాటులోనికి వస్తుంది. ఇదే లైవ్ లోకేషన్ ను ఈ యాప్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సైతం పంచుకోవచ్చు.  ఈ  టీ సేఫ్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది. అన్నీ 5 స్టార్ రేటింగ్ తోొ ఉన్న ఈ యాప్: ను ఇప్పటికే అయిదు వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.


దీన్ని డౌన్లోెడ్ చేసుకున్న  ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రత పట్ల చూపుతోన్న శ్రద్ధను కొనియాడుతున్నారు. ఈ యాప్ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలోని 791 పెట్రోలింగ్ కార్లు, 1085 బ్లూ కోట్స్ వాహనాలు ఈ యాప్ తో లింక్ చేశారు.  సో ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నా.. డయల్ 100 కి ఫోన్ చేసి ‘8’ అంకె నొక్కినా..  మీ ప్రయాణం తెలంగాణ పోలీసుల బాధ్యత. ఇంకెందుకాలస్యం.. వెంటనే మీ ఫోన్‌లో టీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అలాగే..  వెంటనే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.