Telangana News : తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌కు   ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. బుధవారం  నుంచే ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు.   గ‌తంలో ప‌ని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లపై రెండున్నరేళ్ల కిందట ప్రభుత్వం వేటు వేసింది. అప్పట్నుంచి వారంతా నిరుద్యోగులుగా ఉంటున్నారు.  


డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు 


 దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దాదాపు 7,700 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు 2020 మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ప్రభు త్వం లిస్ట్ 1, 2, 3గా విభజించి జీవో నెం. 4779 ద్వారా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను బట్టి వారికి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30దినాలు పని కల్పించిన వారికి రూ.10వేలు, 20 నుంచి 29రోజులు పని కల్పించిన వారికి రూ.9వేలు, 10నుంచి 19రోజులు పని కల్పించిన వారికి రూ.7,500 నెలకు చెల్లిస్తున్నారు. ఇది ఫీల్డ్ అసిస్టెంట్లకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. 


అందర్నీ తొలగించిన ప్రభుత్వం


ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40 పని దినాల సర్క్యులర్‌ను రద్దు చేయాలని, షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతన చట్టం ప్రకారం రూ.21 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ప్రభుత్వం హెచ్చరించినా వెనక్కి తగ్గక పోవడంతో ఆగ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి అందుబాటులో ఉన్న మేట్‌లతో ఉపాధి పనులను నెట్టుకొస్తున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పలుమార్లు ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలతో పాటు స్వయంగా కలిసి వినతులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌  అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తాయి.


రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఉపాధి కల్పించిన ప్రభుత్వం 


అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆరు నెలల తర్వాత అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం పెరగడంతో ఉపాధి పనుల పర్యవేక్షణ కరువవుతోంది. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కూడా కొనసాగడం వాటికి సంబంధించిన ప్రగతి నివేదికలు ఇతర పనులతో కార్యదర్శులు ఉపాధి పనుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద చేపట్టే సీసీ రోడ్లు, కల్లాలు, నర్సరీల నిర్వాహణపై దృష్టి సారించ లేక పోతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కరువవడంతో అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం చివరికి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.