Telangana Rythu Bharosa Funds: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం.. ఆ పార్టీ ప్రకటించిన ఆరు  గ్యారంటీలు. వీటిలో అతిముఖ్యమైంది రైతు భరోసా పథకం. ఈ పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పింది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రైతుభరోసా (Rythu Bharosa) పథకం ఎప్పుడు అమలు చేస్తారని రైతులు  ఎదురుచూస్తున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారని బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 


తెలంగాణలో దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు సరికదా... అప్పులు చేసే పరిస్థితీ లేదు.  బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా అప్పులు చేసిందని... కనుక కొత్తగా అప్పు చెయ్యడానికి అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడం...  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటిన్నర లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు ఎలా సమకూరుస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.  అయితే త్వరలోనే రైతుబంధు అమలు చేస్తామని మంత్రులు చెప్తున్నారు. అయితే.. ఈ పథకంలో కొన్ని మార్పులు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 


గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఎన్ని ఎకరాలు భూమి ఉన్నా... ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున సాయం అందించింది. రెండు విడతల్లో 5వేల రూపాయల చొప్పున  చెల్లించింది. అంటే ఎకరం భూమి ఉన్నవారికి ఏడాదికి రూ.10 వేలు వస్తే.... 10 ఎకరాలు ఉన్నవారికి రూ.లక్ష రూపాయలు అందేవి. దీంతో రైతుబంధు భూస్వాములకు  ఇవ్వొద్దని విమర్శలు వచ్చాయి. కానీ కేసీఆర్‌ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.. అందరికీ రైతు బంధు డబ్బు జమ చేస్తూ పోయింది. ఈ విధానాన్ని ఎన్నికల ముందే  తప్పుబట్టింది కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక... రైతుబంధు పథకంలో మార్పులు చేయొచ్చని భావిస్తున్నారు.


ఇక.. నిధుల కొరతతో.. ఆర్థికపరమైన ఇబ్బందులు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారెంటీలను అయితే ప్రకటించారు... కానీ.. వాటిని అమలు చేసేందుకు సరిపడా డబ్బు ప్రభుత్వ ఖజానాలో లేదని సమాచారం. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు  చేయాలంటే... ఏడాదికి 60వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. వీటిలో రైతు భరోసా ఒక దఫా నిధులు ఇచ్చేందుకే 11వేల కోట్లు  కావాలని అంటున్నారు. కానీ ఖజానాలో కనీసం 5వేల కోట్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతుభరోసా నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న ఆలోచనలో పడిందట  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. నిధులు సేకరించి... రైతుల అకౌంట్లలో జమ చేసేసరికి జనవరి లేదా ఫిబ్రవరి కావొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పరిస్థితిని  ఎలా ఎదుర్కొంటుంది... ప్రతిపక్షాలు సంధించే ప్రశ్రలకు ఎలా సమాధానాలు చెప్తుందో చూడాలి. మరోవైపు.. రైతుబంధు నిధులకు సంబంధించి ఇవాళ ప్రకటన వచ్చే ఛాన్స్‌  ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏం ప్రకటన చేస్తుంది... రైతబంధు నిధులు ఎప్పుడు పడతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు