Kokapet Sharadapeetham lands cancelled:   హైదరాబాద్‌లోని కోకాపేటలో విశాఖ  శారదాపీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది.  కోకాపేటలోని నియోపోలిస్ ఏరియాలో పెరుగుతున్న జనాభా , మౌలిక సదుపాయాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శారదాపీఠం భూమిని వాటర్ బోర్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో తాగునీటి సరఫరా కోసం రిజర్వాయర్లు , ఇతర వసతులు నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకే శారదాపీఠానికి గతంలో ఇచ్చిన 2.34 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని తీర్మానించిందని రెవిన్యూ శాఖ ప్రకటించింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019లో సర్వే నంబరు 240లోని అత్యంత విలువైన ఈ భూమిని ఎకరానికి కేవలం ఒక్క రూపాయి చొప్పున నామమాత్రపు ధరకు శారదాపీఠానికి కేటాయించారు. ప్రజోపయోగ పనుల దృష్ట్యా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది.  కోకాపేటలో వెనక్కి తీసుకున్న భూమికి బదులుగా, శంషాబాద్ ప్రాంతంలో శారదాపీఠానికి సమాన విలువ గల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఆధ్యాత్మిక సంస్థలకు ఇచ్చే గౌరవం ఇస్తూనే, ప్రజా ప్రయోజనాల కోసం ఈ మార్పు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. శంషాబాద్‌లోని అనువైన స్థలాన్ని గుర్తించి, పీఠం నిర్వాహకులకు అప్పగించే ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం వేగవంతం చేస్తోంది.   

Continues below advertisement

 శారదాపీఠం భూమిని వెనక్కి తీసుకోవడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హిందూ ఆధ్యాత్మిక సంస్థలను టార్గెట్ చేస్తోందని బీఆర్ఎస్ ,బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Continues below advertisement

శారదాపీఠం వద్ద పోలీసులు మోహరించడం, పూజలకు ఆటంకం కలిగించారన్న వార్తలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఇది కేవలం అభివృద్ధి పనుల కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని అధికారులు వివరిస్తున్నారు.