Telangana Govt has banned Mayonnaise for one year | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మయోనైజ్‌పై నిషేధం విధించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలు తీస్తున్న మయోనైజ్ పై నిషేధం విధించాలని జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం తెలిసిందే. 


బంజారాహిల్స్ నంది నగర్ లోని ఓ బస్తీలో మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందడంతో పాటు హైదరాబాద్ లో పలుచోట్ల మయోనైజ్ వాడకం వల్ల కస్టమర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మయోనైజ్ వల్ల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులపై చర్చించాక నిషేధానికి మొగ్గుచూపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలంగాణలో మయోనైజ్ నిషేధిస్తూ బుధవారం నాడు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగనుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇకపై గుడ్డుతో తయారు చేసే మయోనైజ్ ను తెలంగాణలో ఏడాదిపాటు వినియోగించకూడదు. మయోనైజ్ కలుషితం కావడం, కల్తీ చేయడం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని రాష్ట్ర  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 






రోజు మయోనైజ్‌ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్, అధిక బరువు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తలనొప్పి, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.