Committee on Tollywood Artists problem | హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సినీ కార్మికుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కార్మిక శాఖ కమిషనర్ దాన కిశోర్ వ్యవహరించనున్నారు. దాంతో పాటు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ కార్మిక సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. కార్మికశాఖ అడిషనల్ కమిషనర్ కన్వీనర్, సభ్యుడిగా ఉంటారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాత యార్లగడ్డ సుప్రియ సభ్యులుగా ఉంటారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, అనుబంధ యూనియన్ నుంచి వల్లభనేని అనిల్ కుమార్, అమ్మిరాజు కనుమిల్లి సైతం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
సినీ కార్మికుల జీతాలు, పనివేళలు, భద్రతే ముఖ్యంగా..
తొలిసారిగా ఈ కమిటీ ఏర్పాటు చేయడంతో సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించి, కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని రోజుల కిందట కొందరు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సమయంలో కమిటీ ఏర్పాటుపై ప్రస్తావించారు. తాజాగా కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా, కార్మికుల జీతాలు, పనివేళలు, భద్రతా ప్రమాణాలు, ఇతర సంబంధిత అంశాలను కమిటీ పరిశీలించనుంది.
నివేదిక సమర్పణకు కాలపరిమితిఈ కమిటీ ఏర్పాటు నుంచి రెండు నెలల్లో సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలని సమయం కేటాయించారు. ఈ నివేదికలో, సినీ పరిశ్రమలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, చట్టాలు, నిబంధనల మార్పులు ప్రతిపాదించనున్నారు.
దసరా తర్వాత మొదటి సమావేశంసినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కమిటీ మొదటి అధికారిక సమావేశం దసరా తర్వాత జరగనుంది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, సినీ పరిశ్రమలోని వివిధ సమస్యలను చర్చించి, వాటిపై తమ సలహాలు, సూచనలు ఇస్తారు. సినీ కార్మికుల సమస్యలు, ముఖ్యంగా వేతనాల పెంపు, పని గంటలు, భద్రత, ఆరోగ్య సంబంధిత అంశాలపై త్వరలో సమగ్రంగా పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ తమ నివేదిక సమర్పించనుంది.
సమావేశంలో తీసుకునే చర్యలుఈ కమిటీలోని సభ్యులు, సినిమాటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులు, కార్మికులు, సౌండ్ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బంది, షూటింగ్ సమయంలో భాగస్వామ్యంగా ఉన్న ఇతర వ్యక్తుల జీవితాలలో మార్పు తీసుకురావడంపై చర్చించనున్నారు. కమిటీ రూపొందించే నివేదిక ఆధారంగా, తెలంగాణ ప్రభుత్వం సులభంగా చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా సినీ పరిశ్రమలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కీలకమైన మార్పులకు దారితీస్తుందని నమ్మకం.