ప్రగతి భవన్ పేరుని జ్యోతిబా పూలే ప్రజా భవన్ గా మార్చి ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. తొలిరోజు ప్రజా భవన్ ముందు పెద్ద హంగామా నడిచింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రజల వద్దకు నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించారు. అంతా బాగానే ఉంది కానీ.. కొంతమంది గేటు బయటే ఉండిపోవాల్సిన పరిస్థితి. తొలిరోజు రష్ ఎక్కువ కావడంతో కొంతమంది బ్యారికేడ్ల బయటే ఉండిపోయారు. మధ్యాహ్నం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ప్రజా దర్బార్ ని తాము ఎందుకు నిర్వహించలేదో ఆయన సోదాహరణంగా వివరించారు. 


ప్రజా దర్బార్ గురించి తాము కూడా ఓ సందర్భంలో కేసీఆర్ ని అడిగామని, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ప్రజా దర్బార్ వ్యవహారంపై తమకు స్పష్టత వచ్చిందని చెప్పారు కేటీఆర్. గతంలో ఆయన ఓ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు కరెక్ట్ గా సింక్ అయ్యేలా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. 






ఆ వీడియోలో కేటీఆర్ ఏమన్నారు..?
ప్రజల ముందు, మీడియా ముందు షో చేయేలానుకునేవారు మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని, ఆ ఏర్పాట్లన్నీ షో పుటప్ అని కేసీఆర్ అన్నట్టుగా ఆ వీడియోలో తెలిపారు కేటీఆర్. ప్రభుత్వంలో ఆరున్నర లక్షలమంది ఉద్యోగులున్నారని, వారంతా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారని, అందుకే సీఎం నేరుగా జోక్యం చేసుకుని అర్జీలు స్వీకరించాల్సిన పరిస్థితి లేదని చెప్పారట కేసీఆర్. "పెన్షన్ కోసం, రేషన్ కార్డ్ కోసం, పట్టాదార్ పాస్ బుక్ లో పేరు ఎక్కడంలేదంటూ.. ప్రజలు ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి ఉందంటే.. ఆ వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు లెక్క. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారమవ్వాలి, కింది స్థాయి అధికారులెవరూ పని చేయకపోతే అప్పుడు సీఎం దగ్గరకు రావాలి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి చేయాల్సినవి కాదు. దానికో యంత్రాంగం ఉంది. వారు ఆ పనులు పూర్తి చేయాలి. శాసన సభ్యులు, మండలి సభ్యులు చేయాల్సింది ఇది కాదు. వారు చట్టాలు రూపొందించాలి. అవి పగడ్బందీగా అమలవుతున్నాయో లేవో చూడాలి. తాము ప్రజల మనుషులం అని చెప్పుకునేవారే ప్రజా దర్బార్ లంటూ షో పుటప్ చేస్తారు." అంటూ కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ ఆ వీడియోలో తెలిపారు. 






ప్రస్తుతం తెలంగాణలో ప్రజా దర్బార్ పరిస్థితి చూస్తే అదే నిజమనిపించేలా ఉందంటూ బీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప గేట్లు తీసేసి, ప్రజా భవన్ అంటూ పేరు మార్చేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నారు. అప్పుడు ప్రగతి భవన్ ముందు గేట్లు ఉండేవని, ఇప్పుడు ప్రజా భవన్ ముందు బ్యారికేడ్లు అడ్డు పెట్టి ప్రజల్ని అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నంపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రజా దర్బార్ లో నేతల్ని కలసినవారు తమ సమస్యలు పరిష్కారం అయిపోతాయని నమ్ముతున్నారు. వారిని కలిసే అకాశం లేనివారు విమర్శలు మొదలు పెట్టారు, మరోవైపు ప్రతిపక్షం కూడా ఇలా విమర్శలు ఎక్కుపెడుతోంది.