Telangana formation Day : తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల మూలస్తంభాల మీద నడిచింది. నీళ్లు, నిధుల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. కానీ నియామకాల విషయంలో మాత్రం ఇంకా తెలంగాణ యువతలో అసంతృప్తి నెలకొంది. ఎనిమిదేళ్ల పాటు ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదంటే యువతకు ఎలాంటి అసంతృప్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .2016 తర్వాత మళ్లీ గ్రూప్-2 నోటిఫికేషన్ ఊసేలేదు. ఇటీవల ఎనభై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించారు.
ఉద్యోగాల కోసం యువత ఎదురు చూపులు !
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ మిగిలిన 80,039 కొత్త ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియెట్, హెచ్‌వోడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో పేరు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యే సుమారు 25 లక్షలు దాకాఉంది. 80 వేల ఉద్యోగాలకే ప్రకటన చేస్తే మిగతా నిరుద్యోగుల సంగతేమిటి? తెలంగాణ యువత భవిష్యత్తు కోసం నిర్ధిష్టమైన ఉద్యోగ, ఉపాధి పాలసీని ప్రకటించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని యువత కోరుతోంది. ఉద్యమంలో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన యువతను ఇన్నేళ్లూ నిరాశకు గురి చేయడం విచారకమని యువత అంటోంది.
ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం !
ధనిక తెలంగాణలో ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పులు ఇబ్బడిమబ్బడిగా చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త అప్పులకు అవకాశం చిక్కలేదు. దీంతో జీతాలకూ చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పింది. జీతాలు, అప్పులకు వడ్డీలు, పెన్షన్లు ఇలాంటివి ఇలాంటి వాటికే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దీంతో సరిపోతుంది. కానీ ఈ నెలలో రైతులకు పెట్టుబడి సాయాన్ని చేయాలి. వానాకాలం రైతుబంధుకు రూ.7600 కోట్లు అవసరమని ప్రభుత్వం గుర్తించి నిధుల సమీకరణ చేస్తోంది. కానీ కేంద్రం సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు రూ. పదివేల కోట్ల లభించకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది తెలంగాణ సర్కార్ రూ.లక్ష కోట్ల అభివృద్ధి రుణాలను సమీకరించుకోవడానికి ప్రతిపాదించింది. జూన్ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్ రుణాలను తీసుకునేందుకు నిర్ణయించింది. కానీ తెచ్చుకోలేకపోయింది. అప్పులు లభించకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కుటుంబ పాలన విమర్శలు !
తెలంగాణ ప్రభుత్వంపై కుటుంబ పాలన విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుండి మంత్రి మండలిలో ముగ్గురు ఉన్నారు. మరో కుటుంబసభ్యుడయిన ఎంపీ దేశ రాజధానిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యురాలయిన మరో ఎమ్మెల్సీ కూడా రాజకీయాల్లో.. అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువగా కుటుంబపాలన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇంకాతెలంగాణకు విముక్తి రాలేదన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి.
రైతులకు అవే కష్టాలు !
తెలంగాణ రైతులకు కష్టాలు పూర్తిగా తొలగలేదు. పంటలు పండుతున్నాయి కానీ గిట్టుబాటు ధర రావడం లేదు. ధాన్యం కొనుగోలు అంశం ప్రతీ ఏడాది వివాదాస్పదం అవుతోంది. రైతులు దళారుల బారినపడక తప్పడం లేదు. మద్దతు ధరవిషయంలోనూ పెద్దగా సాంత్వన లభించలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే.. రైతుల కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మినప్పటికీ ఎనిమిదేళ్లయినా అవి అలాగే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఎకరాకు ఏడాదికి రూ. పదివేల ఆర్థిక సాయం చేస్తోంది. రైతు బీమా పెట్టింది. అయినప్పటికీ సమస్యలు వెంటాడుతనే ఉన్నాయి.