Telangana formation Day :  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా సాగింది. 58 ఏళ్లపాటు వివక్షకు గురైన జనం సొంత రాష్ట్రం సాధించుకున్నారు. 2014 జూన్ 2న దేవంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.  తెలంగాణ ఏర్పడి ఎనిమదిళ్లవుతున్న సందర్భంగా తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన స్ట్రగుల్‌ను ఓ సారి తెలుసుకుందాం ! 


1968 తొలి దశ ఉద్యమంలోనే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష !


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆషామాషీగా సాగలేదు. దశాబ్దాల పోరాటం. అంతకు మించి ఎన్నో ప్రాణాల త్యాగ ఫలితం.  1968లో తొలి సారిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది.  1969 నాటి ఉద్యమంలో 360 మందికి పైగా  ప్రాణాలు త్యాగం చేశారు.  ఆ నాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధం నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు.  ఈ స్థూపమే నేడు అన్నింటికీ స్ఫూర్తిగా నిలిచింది. అప్పటి యువతరం.. ఇప్పటి యువతరం.. ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దాలుగా పోరాడారు. ఆ క్రమంలో ప్రాణాలు సైతం వదులు కున్నారు. తమ ఆకాంక్ష కోసం ఇంత పెద్దమొత్తంలో ఆత్మబలిదానాలు చేసుకున్న చరిత్ర బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో  సుమారు వెయ్యి మంది వరకూ  ప్రాణ త్యాగం చేశారు. 


రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ !


తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా కేసీఆర్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ సాధనే లక్ష్యంగా ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్‌లోని జలదృశ్యంలో   పార్టీ ప్రకటన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను సిద్ధాంతకర్తగా పెట్టుకుని పోరాటం ప్రారంభించారు. ఆ రోజున కేసీఆర్ వెంట పెద్దగా ఎవరూ లేరు. ఎన్ని ఎదురు దెబ్బలైనా ముందుకే సాగారు. తెలంగాణ హామీతో  2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలను, 5 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగలిగింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగానూ చేరింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని పెట్టినా… రాష్ట్రం ఏర్పాటు చేయలేదని చెప్పి.. పదవుల్ని త్యాగం చేసేశారు. ఉపఎన్నికల ద్వారా తెలంగాణ ఆకాంక్షను దేశానికి చాటారు.


కేసీఆర్ అమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు మేలి మలుపు ! 
 
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రం D/fxof.  కేసీఆర్ చేపట్టిన దీక్ష సకల జనులను కదిలించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన చేసింది.   2009 డిసెంబర్ 10న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని పార్లమెంటులో ఆనాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. దీనిపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు కొనసాగడంతో అదే నెల 28న  తెలంగాణపై మరో ప్రకటన చేశారు. తెలంగాణపై పూర్తిస్థాయి అధ్యయనానికి ఓ కమిటీ వేస్తామని చెప్పడంతో ఉవ్వెత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం, అది నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో యువతలో అశాంతి నెలకొంది.  


శ్రీకాంతాచారి ఆత్మాహుతితో ఉద్యమం మరింత తీవ్రం !
 


తెలంగాణ కోసం డిసెంబర్ 3, 2009న ఎల్బీనగర్‌లో ఒంటికి నిప్పంటించుకుని బలిదానం చేసుకున్నాడు. ఆయన ఆత్మార్పణం తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఎం.యాదిరెడ్డి  జూలై 20, 2011న ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి రాసిన పదిపేజీల సూసైడ్‌నోట్‌లో..‘సోనియాగాంధీజీ.. మా తెలంగాణ మాకు ఇచ్చేయండి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను హింసిసున్నాయి’ అని  ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ బలిదానం తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చింది.వీరి ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వీళ్లే కాకుండా మరెందరో చేసుకున్న ఆత్మార్పణలు తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. అమరుల త్యాగ ఫలితంగా   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.